ఆడియో
 
 
 
 
'అహ నా పెళ్ళంట' పాటలు
‘అల్లరి’ నరేష్ హీరోగా, రీతూ బర్మేచ కథానాయికగా ఎటివి అధినేత అనిల్ కుమార్ సుంకర సారథ్యంలో వీరభద్రం చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘అహ నా పెళ్ళంట’ ఆడియో హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించి, తొలి ప్రతిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కిషోర్‌కి అందించారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ-‘‘ఈ సంస్థ నిర్మించిన ‘బిందాస్’ చిత్రం ఆడియోను నేనే ఆవిష్కరించాను. ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ‘అహనా పెళ్లంట’ సినిమా ఆడియోను కూడా నేనే ఆవిష్కరిస్తున్నాను. ఈ సినిమా కూడా తప్పకుండా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇది. రఘు కుంచె సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. నరేష్ సినిమాలో పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలుస్తుంది. నాకీ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్స్’’ అని చెప్పారు.

సంగీత దర్శకుడు కుంచె రఘు- ‘బంపర్ ఆఫర్’ తర్వాత చేస్తున్న సినిమా ఇదని, మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని, నరేష్ కెరీర్‌లోనే ఇది పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత గరికపాటి కిషోర్- షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ చిత్రంలో డా.శ్రీహరి, డా.బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నాగినీడు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సేపన, కెమెరా: లోక్‌నాథ్, నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్.