Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘అలా మొదలైంది’ పాటలు
ఒక అబ్బాయి... ఒక అమ్మాయి మధ్య ప్రేమ అనేది ఎలా మొదలైంది..? అని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అలా మొదలైంది’. నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి బీవీ నందినీరెడ్డి దర్శకురాలు. కె.దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో కె.రాఘవేంద్రరావు, జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నందినీరెడ్డి మాట్లాడుతూ-‘‘నానిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాను. యువతకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అతనికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. జయసుథ తర్వాత మళ్లీ నిత్యామీనన్ సహజనటిగా తెలుగుతెరపై వెలుగొందుతుందని నమ్మకంగా చెప్పగలను. కళ్యాణ్ మాలిక్‌ను ఈ సినిమా సంగీతం విషయంలో ఎంతో ఇబ్బంది పెట్టాను. ఈ విషయంలో ఆయనకు సారీ చెప్పుకుంటున్నాను. మంచి సంగీతాన్ని అందించారాయన’’ అని చెప్పారు. తన అభిరుచి మేరకు సంగీతాన్ని తన నుంచి సందినీ రెడ్డి రాబట్టుకున్నారు రాబట్టుకున్నారు అని కళ్యాణ్‌మాలిక్ అన్నారు.

‘‘దర్శకత్వ శాఖలో ఉన్న నాకు నటనపై ఆసక్తిని రేకెత్తించేలా చేసింది నందిని. ఎంతో కష్టపడి ఈ సినిమాను తీర్చిదిద్దారు తను. నా తొలి చిత్రం ‘అష్టాచెమ్మా’కు కళ్యాణ్ మాలిక్ సంగీత దర్శకత్వం వహించారు. మళ్లీ ‘అలా మొదలైంది’ కూడా ఆయనే సంగీతం అందించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మాది హిట్ కాంబినేషన్‌గా నిలబడాలవి’’ అని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇందులో నటించడంతో పాటు, గానం కూడా చేశానని, గాయకురాలిగా కూడా తనను ప్రోత్సహించిన యూనిట్‌కి కృతజ్ఞతలని నిత్యామీనన్ అన్నారు. ఇంకా ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీను వైట్ల, ఎ.కోదండరామిరెడ్డి, గుణ్ణం గంగరాజు, దేవకట్ట, భీమినేని శ్రీనివాసరావు, లక్ష్మీ భూపతి, రూపాదేవి, శ్రీవాసు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో గెస్టులుగా పాల్గొన్నారు.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com