డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ లు హీరోలుగా ప్రీతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై సాగర్ చంద్ర దర్శకుడిగా డాక్టర్ బి.సుధాకర్ బాబు, రంగన్న అచ్చప్పలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అయ్యారే’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యన్.శివప్రసాద్, ఇందూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ప్రదీప్ రెడ్డి, నివాస్, సునిల్ కశ్యప్, సాగర్ చంద్ర, అనంత్ శ్రీరామ్, అనీషా సింగ్, బేబి అంజలి, సాయికుమార్, భాస్కర్ సామల, సంధ్య జలక్, సాయికిరణ్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యన్.శివప్రసాద్ సిడిని విడుదల చేసి తొలి ప్రతిని సాయి కుమార్ కు అందజేశారు.
శివాజీ మాట్లాడుతూ - ఈ సినిమాను ఎంతో కష్టపడి తీసిన నిర్మాతలకు, సినిమాకు పని చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుడు మంచి ప్రతిభ ఉన్నవాడు. సినిమా కొత్త కాన్సెప్ట్ తో రూపొందింది. సాయి కుమార్ గారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు చేసిన పాత్ర నేను చేద్దామని అనుకున్నాను. అయితే ఆయన చేస్తేనే బాగుంటుందని ఆయన్నే చేయమని అన్నాము. ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ -ఇది సైకలాజికల్ థ్రిల్లర్. నా స్నేహితుడు రాజేంద్ర ప్రసాద్, శివాజీలు అడగడంతో ఈ సినిమా చేశాను. సినిమా ఆడియో మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ - నా చేత ఈ ఆడియో ఆవిష్కరణ గావించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సాగర్ చంద్ర మాట్లాడుతూ - ఈ సినిమా బాగా రావడానికి ఈ చిత్ర నిర్మాతలే కారణం. నటీనటులందరూ తమ సహకారాన్ని అందించడంతో సినిమాను బాగా రూపొందించగలిగాను అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - రాజేంద్రప్రసాద్ గారితో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. ఆయన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సునిల్ కశ్యప్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. అతను మంచి ప్రతిభావంతుడు. ఈ సినిమాకు తమ సహకారాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.