ఆడియో
 
 
 
 
'బ్యాచ్‌లర్స్ 2' పాటలు
జాకీర్ దర్శకత్వంలో మరియమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన 'బ్యాచ్‌లర్స్ 2' సినిమా ఆడియో సీడీలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి కాపీని మల్టీడైమన్షన్ ప్రతినిథి వాసుకు అందజేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు జాకీర్ మాట్లాడుతూ "అంతా కొత్తవారితో మా గురువు సానా యాదిరెడ్డి రూపొందించిన 'బ్యాచ్‌లర్స్' మంచి సక్సెస్ సాధించింది.

చిత్రంలో దమ్ముంటే కొత్తవాళ్లు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా చిత్రాలు రుజువు చేశాయి. నేను సత్తా ఉన్న సినిమా తీశాను. తొలి కాపీ వచ్చింది. 'రోడ్‌ట్రిప్' అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా చేశా. నలుగురు అబ్బాయిలు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ప్రయాణం చేసే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా. అలీ కామెడీ హైలైట్ అవుతుంది. పాటలన్నీ బాగా వచ్చాయి. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని చెప్పారు.

భరద్వాజ్ మాట్లాడుతూ "కొత్తవాళ్లయినా సరిగ్గా తీస్తే ఆడతాయని 'చిత్రం', 'బ్యాచ్‌లర్స్' రుజువు చేశాయి. జాకీర్ ఎంతో నమ్మకంతో తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివారెడ్డి, ఆదిత్య దయానంద్, ఖైరతాబాద్ కార్పొరేటర్ మోహన్, సంగీత దర్శకుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.