ఆడియో
 
 
 
 
‘క్రికెట్ - గర్ల్స్ - బీర్’ పాటలు
ఒకరికి క్రికెట్‌ అంటే ప్రాణం. మరొకరికి తన ప్రియురాలే లోకం. ఇంకొకరికి బీరే అమృతం. వీరు ముగ్గురు అన్నదమ్ములు. ఇంతకీ వీరి కథేంటో తెలియాలంటే 'క్రికెట్‌ గర్ల్స్‌ అండ్‌ బీర్‌' చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు ఉమేష్‌కుమార్‌. ఆయనే ఈ చిత్రానికి దర్శకుడు. ఆదర్శ్‌, సూర్యతేజ్‌, నాగశౌర్య ప్రధాన పాత్రధారులు. సారిక అఫ్హన్‌ నాయిక. సునీత నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని రాష్ట్ర మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఆవిష్కరించగా నిర్మాత సి.కల్యాణ్‌ స్వీకరించారు.

దర్శకుడు మాట్లాడుతూ ''మేము ముగ్గురు అన్నదమ్ములం. భిన్నమైన అభిరుచులు మావి. దాన్నే కథాంశంగా తీసుకుని కొంత ఊహను జోడించి చక్కటి కథగా మలిచాను. వినోదభరితంగా హుషారైన సన్నివేశాల కలబోతగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను. నేటి తరం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. పాటలన్నీ బాగున్నాయ''న్నారు.

''అమెరికాలో పెరిగినా తెలుగు సినిమాకి బాణీలు కట్టడం ఆనందంగా ఉంది. మా పాటలు శ్రోతల్ని అలరిస్తాయ''న్నారు సంగీత దర్శకుడు దాస్‌. ఈ కార్యక్రమంలో వరుణ్‌సందేశ్‌, రామ్‌ప్రసాద్‌ చిత్ర బృందం పాల్గొన్నారు. గూగ్లీ మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి.