ఆడియో
 
 
 
 
నా కెరీర్ లోనే బెస్ట్ ఆడియో 'దడ'
‘‘నేను చేసిన సినిమా చూసి నా తల్లి గర్వ పడాలి. నా భార్య, పిల్లలు ఆనందించాలి. ఆ విధంగా సినిమాలు ఉండాలనేది నా అభిమతం. కానీ ఇప్పుడు అలాకాదు. కేవలం కురక్రారును మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలు వస్తున్నాయి. సినిమా అనేది వ్యాపారం కాబట్టి నిర్మాతలకు ఏది లాభమో అలా చేయడమే కరెక్ట్. ఏ మాయచేసావె, 100%లవ్ చిత్రాలతో చైతూ లవర్‌బోయ్ అనిపించుకున్నాడు. ఈ సినిమా చూస్తుంటే మరో ప్యాట్రన్‌లో సాగే సినిమా లాగా అనిసిస్తుంది. శివప్రసాదరెడ్డి అభిరుచి గల నిర్మాత. సమర్థులందరూ కలిసి పనిచేసిన సినిమా కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని డా.అక్కినేని నాగేశ్వరరావు అన్నారు.

నాగచైతన్య హీరోగా, అజయ్‌భుయాన్ దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘దడ’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అక్కినేని పై విధంగా స్పందించారు. ఆడియో సీడీని అక్కినేని ఆవిష్కరించి, తొలి ప్రతిని డా.డి.రామానాయుడికి అందించారు. ‘100%లవ్’ చిత్రాన్ని మించిన విజయాన్ని ఈ చిత్రం సాధించాలని, మా సురేష్ సంస్థలో త్వరలోనే చైతూ నటించనున్నాడని రామానాయుడు చెప్పారు.

నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘‘జోష్’ చేస్తున్నప్పుడే ‘దడ’ గురించి శివప్రసాదరెడ్డిగారు చెప్పారు. దర్శకుడు అజయ్ నాకు మంచి మిత్రుడు. మంచి ఎనర్జీ ఉంది అతనిలో. రెడ్డిగారి అభిరుచికి తగ్గట్టుగా, తన స్టైల్‌లో ఈ సినిమాని సూపర్బ్‌గా తీశాడు. ఇక దేవిశ్రీ.. నాన్నగారికి మాస్, మన్మథుడు, కింగ్ లాంటి ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇక నా ‘100% లవ్’కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలిసిందే. ‘దడ’ నా కెరీర్‌లోనే బెస్ట్ ఆడియో అవుతుంది’’ అని తెలిపారు.

‘‘40 ఏళ్ల క్రితం దసరాబుల్లోడు, ప్రేమనగర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 20 ఏళ్ల క్రితం గీతాంజలి, శివ సంచలనం సృష్టించాయి. ఈ ఏడాది 100%లవ్, దడ చిత్రాలతో పాత చరిత్రను చైతూ పునరావృతం చేయబోతున్నాడు. చైతన్యలోని మరోకోణాన్ని ఇందులో చూస్తారు. ఆగస్ట్ 12న ‘దడ’ను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఇంకా అల్లు అరవింద్, రానా, సుశాంత్ అఖిల్, అచ్చిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.