జి. శివ దర్శకత్వంలో లక్ష్మీవాసంతి ప్రొడక్షన్స్ పతాకంపై అడ్డాల వెంకట్రావు, ఎ. సెల్వంలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ధనం’ అనువాద చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, సంగీత, ప్రసన్నకుమార్, సుబ్రహ్మణ్యం, గంజి లక్ష్మీనారాయణ, ప్రసాద్, చంద్రబోస్, నరసింహారావు, ఉమా నేహ, సాహితి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ- ఇళయరాజా చిత్రానికి పాట రాయాలని చిరకాల కోరిక. అది ఈ చిత్రంతో తీరింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ- డబ్బింగ్ సినిమాలో పాటలు స్పష్టంగా వినపడడం ఈ చిత్రంలో జరిగింది. ఈ సినిమాలో నేను గిరీష్‌కర్నాడ్ కలిసి నటించాను. సంగీత చాలా అద్భుతంగా నటించింది. కుటుంబపాత్ర, రఫ్ పాత్రను ఆమె బాగా పోషించింది. తెలుగులో ఈ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను అన్నారు.
దర్శకుడు శివ మాట్లాడుతూ, ఈ సినిమాలో కోట ఐదురోజులు పనిచేశారు. 15సీన్స్ అద్భుతంగా పండించారు. ఈ సినిమాలో సంగీత లేకుంటే సినిమానే లేదు. ఆమె ఎంతో కష్టపడి చేసింది. ఫిలింసిటీలో ఈ సినిమాను చిత్రీకరించాం. త్వరలో ఈ సినిమాను విడుదలచేయనున్నామని తెలిపారు.
సంగీత మాట్లాడుతూ- ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎలా వస్తుందోనని భయమేసింది. సీనియర్స్ నటించడం, వారి నిర్ణయం తప్పుకాదని ధైర్యంచేశాను. వారితో నటించే అవకాశం కల్గినందుకు ఆనందంగా ఉంది. నాలో ఉన్న టాలెంట్‌ను చూపించడానికి ఈ చిత్రం తోడ్పడింది. తప్పకుండా విజయసాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత అడ్డాల వెంకట్రావ్ మాట్లాడుతూ- ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద టెక్నీషియన్స్ తో పనిచేయించాము. జులైలో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం అన్నారు.