ఆడియో
 
 
 
 
'జర్నీ' పాటలు
సురేష్ కొండేటి నిర్మాణ సారథ్యం వహించిన చిత్రం 'జర్నీ'. శర్వానంద్, అంజలి, జై, అనన్య కీలక పాత్రధారులు. యం.శరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో మురుగదాస్ నిర్మించారు. సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మురుగదాస్ కుమారుడు ఆదిత్య సీడీని ఆవిష్కరించారు. రానా అందుకున్నారు. మురుగదాస్ మాట్లాడుతూ "ఫాక్స్ సంస్థతో కలిసి నేను నిర్మించిన తొలి చిత్రమిది. శరవణన్ దర్శకత్వం మెప్పిస్తుంది. సత్య మంచి సంగీతాన్నిచ్చారు.

'గజిని' సురేష్ చేయాల్సింది. కానీ అప్పుడు మిస్ అయింది. ఈ సినిమాకు సంప్రదించిన వెంటనే ఇచ్చేశాం'' అని అన్నారు. "కథ నచ్చి ఈ సినిమా చేశా. మంచి నటీనటులు కథకు దొరికారు. అన్ని పాత్రలూ మెప్పిస్తాయి. మంచి సినిమా అవుతుంది'' అని దర్శకుడు చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ "నేను 15 ఏళ్ళుగా జర్నలిస్ట్‌గా చేశాను. 'ప్రేమిస్తే' మంచి టేస్ట్‌ఫుల్ సినిమా. అక్కడి నుంచి 'షాపింగ్‌మాల్', 'నాన్న', 'జర్నీ' చేశాను. అభిరుచి కలిగిన సినిమాలవి. 'ప్రేమిస్తే' కన్నా నాలుగు రెట్ల ఆనందం 'జర్నీ'తో వస్తుంది. సత్య సంగీతం, సాహితి సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. ఈ సినిమా రావడానికి నటి అంజలి కూడా ఓ కారణం. ఆమెకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.

"సురేష్‌తో ఉన్న అనుబంధంతో ఈ సినిమాకు డబ్బింగ్ చేసే అవకాశాన్ని అడిగాను. వెంటనే అంగీకరించడం సంతోషం'' అని సాహితి చెప్పారు. చక్కటి పాటలు కుదిరాయని సత్య అన్నారు. సినిమా విజయం సాధించాలని అంబిక కృష్ణ, రానా, నాని, అల్లరి నరేష్, శర్వానంద్, నవదీప్, అంజలి, దేవాకట్టా, గోపీచంద్ మలినేని, ఆదిత్య దయానంద్ తదితరులు ఆకాంక్షించారు. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.