రామ్, హన్సిక జంటగా నటించిన చిత్రం 'కందిరీగ'. అక్ష మరో నాయిక. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్నారు. మల్టీ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సంస్థ సమర్పిస్తోంది. సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకుడు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలను గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని హీరో వెంకటేష్ విడుదల చేశారు. వి.వి.వినాయక్, గోపీచంద్ అందుకున్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ "ఈ కథను నాకు దర్శకుడు ముందు చెప్పారు. అతనిలోని క్లేరిటీ, స్పీడ్ అప్పుడే తెలిసింది. యువతరం హీరోల్లో రామ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
వినాయక్ మాట్లాడుతూ "చెన్నకేశవరెడ్డి సమయంలో ఆపరేటివ్ కెమెరామేన్‌గా పనిచేశాడు శ్రీనివాస్. ఓరోజు వచ్చి సినిమా దర్శకత్వం చేస్తానంటే ఆశ్చర్యపోయా. మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు'' అని చెప్పారు. శ్రీనివాస్ నాకు పదేళ్ళ నుంచి తెలుసు. మంచి దర్శకుడవుతాడు అని గోపీచంద్ అన్నారు.
దర్శకుడు చెబుతూ "కథను నమ్మి సినిమా తీసే నిర్మాత బెల్లంకొండ. నా మీద, నా కథ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. రామ్, థమన్ అందరూ బాగా సహకరించారు'' అని చెప్పారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ "నేను ఈ కథని రెండు సార్లు విన్నాను. అన్నీ హంగులూ కుదిరాయి.తప్పక విజయాన్ని నమోదు చేసుకుంటుందన్న నమ్మకం ఉంది'' అని అన్నారు. "తియ్యగా మాట్లాడుతూ పనిచేయించుకోవడం, ఏదైనా బెంగపడితే నేనున్నానంటూ ధైర్యమివ్వడం నిర్మాత లక్షణాలు. ఇవి రెండూ బెల్లంకొండ సురేష్‌లో పుష్కలంగా ఉన్నాయి.
రామ్ మాట్లాడుతూ - 'రామరామ కృష్ణకృష్ణ' తర్వాత విరామం తీసుకుని 'కందిరీగ'తో వస్తున్నాను. తప్పకుండా హిట్ సినిమా అవుతుంది. 'గణేష్' తర్వాత కొత్త దర్శకులతో చేయకూడదనుకున్నా. కానీ శ్రీనివాస్ మంచి కథ చెప్పి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత అందరూ అతన్ని మాసూ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆండ్రూ కెమెరా మెప్పిస్తుంది. థమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఈ సినిమాలో భాస్కరభట్ల రాసిన పాటలు విన్నాక ఆయన్ని ఇంతవరకు ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది'' అని చెప్పారు.
మంచి పాటలు రాసే అవకాశమొచ్చిందని భాస్కరభట్ల అన్నారు. పాటలు అందర్నీ మెప్పిస్తాయని థమన్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసినంత సేపూ వినాయక్ సినిమా చూసినట్టుంటుందని కోన వెంకట్ చెప్పారు. మంచి పాత్రల్లో నటించామని హన్సిక, అక్ష తెలిపారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, స్రవంతి రవికిషోర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య దయానంద్, రజిత్ పార్థసారథి, సాయిరెడ్డి, ఆండ్రూ తదితరులు పాల్గొన్నారు.