ఆడియో
 
 
 
 
సిద్ధార్ద్ రాజ్ కుమార్ 'కెరటం' పాటలు విడుదల
సిద్ధార్ద్ రాజ్ కుమార్ కథానాయకుడిగా గౌతమ్ పట్నాయక్ దర్శకత్వంలో ఎస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి.బాబు నిర్మిస్తున్న ‘కెరటం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంగా మైక్రోచిప్ లో ఆడియోను దశరథ్ ఆవిష్కరించారు. ప్రభాస్ ఆడియోను పెన్ డ్రైవ్ ద్వారా విడుదల చేశారు. కృష్ణంరాజు సిడీని ఆవిష్కరించి, మొదటి సీడిని ప్రభాస్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, ప్రభాస్, ఆర్పీ పట్నాయక్, వేణుమాధవ్, భీమినేని శ్రీనివాసరావు, ఎవిఎస్, తమ్మారెడ్డి భరద్వాజ్, సాగర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ద్ రాజ్ కుమార్, ఎస్.వి.బాబు, ఎస్.ఎ.రెహ్మాన్, లక్ష్మీనారాయణ, దశరథ్, సోమా వీర్రాజు, ఎస్.ఆర్.కె.కె.వి.రాజా బహదూర్, ఎ.వి.ఎస్.రాజు, గౌతమ్ పట్నాయక్, యతిరాజ్, అమిత్, ప్రదీప్, గణేష్, స్ఫూర్తి, శిల్ప, వెంకటేష్, కన్నడ నటుడు జగదీష్ తదితరులు పాల్గొన్న అదే వేదికపై సిద్ధార్థ్‌ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు జరగడం విశేషం.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ- ‘‘ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాకు నేను సంగీత దర్శకత్వం వహించాను. ఈ రోజు ఈ చిత్రానికి మా అన్నయ్య దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా వుంది. మా అన్నయ్యను నేను పరిచయం చేయలేదు. ఆయన స్వశక్తితో ఎదిగారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈ బ్యానర్ వారే. మా అన్నయ్యను కూడా పరిచయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’’ అన్నారు.

ప్రభాస్‌ మాట్లాడుతూ- ‘‘తొలిసినిమా జ్ఞాపకంగా...ప్రతి షాట్‌ నీ చరిత్రలో నిలిచి ఉంటుంది. ఇక్కడ కష్టించి పనిచేయాలి. కేరెక్టర్‌ చాలా ముఖ్యం...అని చెప్పారు పెదనాన్న. నేనీరోజు హీరో కావడానికి కారణం పెదనాన్న. నేనేం సాధించినా అందుకు ఆద్యుడాయనే. తనే మాకు ప్రేరణ. హీరో సిద్ధార్థ్‌ నా సోదరుడు. తనలో చాలా ఈజ్‌ ఉంది. అందగాడు కూడా. మంచి హీరోగా పెదనాన్న పేరు నిలపాలి’’ అన్నారు.

సిద్ధార్ధ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ- ‘‘మీ అందరిలో ఒకడిని. పెదనాన్న, అన్నయ్య (ప్రభాస్‌) అంతటివాడిని కావాలనుకుంటున్నా. మీ ఆశీస్సులు కావాలి’ అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ- ‘‘ప్రభాస్‌ రోజు రోజుకి ఎదుగుతున్న హీరో. మిస్టర్‌పెర్ఫెక్ట్‌-లో ఉత్తమ నటనను కనబరిచాడు. గోపికృష్ణ బేనర్‌లో ఇక తనతో సినిమాలు ధీమగా తీయొచ్చు. అలాగే సిద్ధార్ధ్‌ రాజ్‌కుమార్‌ హీరో అవుతానన్నపుడు..సొంతంగా ప్రయత్నించమని చెప్పాను’ అన్నారు.

ఎస్వీ బాబు మాట్లాడుతూ- ‘‘నేను కృష్ణంరాజు గారిని అభిమానిని వారి కుటుంబం నుంచి హీరోని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

సుమన్‌, యమున, వేణుమాధవ్‌, యతిరాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: జోష్వా శ్రీధర్‌, కెమెరా: ఎ. వెంకటేష్‌, పాటలు: రెహమాన్‌.