ఆడియో
 
 
 
 
'మార్క్' పాటలు
ఫైట్‌మాస్టర్ విజయన్ దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టి లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'మార్క్' పాటలు మధుర ఆడియో ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. శ్రీహరి ఓ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం ద్వారా హీరోగా విజయన్ కుమారుడు శబరీశ్ పరిచయమవుతున్నారు.

బ్యాంకాక్‌కు చెందిన పింకీ నాయిక. సుందర్ సి. బాబు సంగీతం సమకూర్చారు. వెన్నెలకంటి పాటలు రాశారు. విజయన్ దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, ఫైట్స్‌ని సమకూర్చారు. సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి ప్రతిని సీనియర్ నిర్మాత డి. సురేశ్‌బాబుకు అందజేశారు.

ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచీ తన వృత్తిలో నెంబర్‌వన్‌గా విజయన్ డైరెక్ట్ చేస్తూ తన కుమారుడు శబరీశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్న 'మార్క్' సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. శబరీశ్‌లో మంచి ప్రతిభా పాటవాలున్నాయనీ, హీరోగా రాణిస్తాడనే నమ్మకం ఉందనీ ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తనని తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సుందర్ సి. బాబు చెప్పారు.

విజయన్ మాట్లాడుతూ "ఫైట్ మాస్టర్‌గా 35 ఏళ్ల నుంచీ చేస్తున్నా. ఫైట్ మాస్టర్‌గా 'మార్క్' నాకు 480వ చిత్రం. వాటిలో 400 హిట్స్ ఉన్నాయి. నేను తెలుగు సినిమాలకే ఎక్కువగా పనిచేశా. నన్ను ఈ స్థాయికి తెచ్చింది తెలుగువాళ్లే. నా కుమారుడు శబరీశ్‌ని 'మార్క్'తో హీరోగా పరిచయం చేస్తున్నా. అన్ని విధాలా శిక్షణపొంది ఈ సినిమా చేశాడు.

ఇందులో కీలక పాత్రకి శ్రీహరి తప్ప మరొకరు నాకు తట్టలేదు. కథ కూడా వినకుండా నేను అడగ్గానే సరేనంటూ చేశాడు. సుందర్ సి. బాబు చాలా అందమైన సంగీతాన్నిచ్చాడు. ఈ సినిమాకి నిర్మాతగా నట్టి కుమార్‌ని శ్రీహరే సూచించాడు. ఇది బాగా కష్టపడి, ఖర్చుపెట్టి చేసిన చిత్రం. ఈ చిత్రాన్నీ, నా కుమారుణ్ణీ ఆదరించాల్సిందిగా కోరుతున్నా'' అని చెప్పారు.

శ్రీహరి మాట్లాడుతూ "విజయన్ మాస్టర్‌తో నా ప్రస్థానం 'టూ టౌన్ రౌడీ'తో మొదలైంది. ఎన్నో సినిమాలు కలిసి చేశాం. నేను ఇంత దృఢంగా ఉండటానికి కారణం ఆయనే. 'మార్క్' సూపర్ డూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా తీశారు విజయన్. మిగతా సినిమా అంతా బోనస్సే. శబరీశ్ ఎక్సలెంట్‌గా చేశాడు. అతను గెలుస్తున్నాడు. నా పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నా. సుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు'' అన్నారు. మ్యూజిక్, సినిమా చాలా బాగా వచ్చాయనీ, తనని ఆశీర్వదించండనీ శబరీశ్ కోరారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత నట్టి కుమార్, సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్, నటుడు, నిర్మాత బి.వి. రెడ్డి, నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసన్నకుమార్, తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు అమ్రేశ్ కుమార్, నిర్మాతలు డి.ఎస్. రావు వానపల్లి బాబూరావు పాల్గొని మాట్లాడారు.