ధర్మపద క్రియేషన్స్ పతాకంపై ఇదివరకు 'గౌతమ బుద్ధ' చిత్రాన్ని నిర్మించిన కె. రాజశేఖర్ తాజాగా 'మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా' అనే ప్రేమ కథాచిత్రాన్ని అందిస్తున్నారు. రేవంత్, రాజిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి అరుణ్ రుద్ర, కిరణ్ మీగడ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు మధుర ఆడియో ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ గేయ రచయిత సీతారామశాస్త్రి ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబుకు అందజేశారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ"అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఇది కేవలం ప్రేమకథ కాదు. పిల్లల, పెద్దల బాధ్యతల్ని కూడా గుర్తుచేసే సన్నివేశాలున్నాయి. అవి మనసుల్ని హత్తుకుంటాయి. ఈ చిత్రం కోసం మైఖేల్ మక్కల్ ఏడు మధురమైన పాటలకు మెలోడీ బాణీలు అందించారు. తప్పకుండా ఆడియో, సినిమా విజయం సాధిస్తాయని నమ్ముతున్నాం'' అని చెప్పారు. హీరో రేవంత్ మాట్లాడుతూ "నేను వైజాగ్ అబ్బాయిని.
ఫేస్‌బుక్ ద్వారా ఆడిషన్‌కి వెళ్లి సెలక్టయ్యా'' అన్నారు. హీరోయిన్ రాజిత మాట్లాడుతూ "ప్రస్తుతం పూణేలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చేస్తున్నా. నిర్మాత రాజశేఖర్ నా తండ్రిగా నటించారు'' అని చెప్పారు. నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అందంగా తీయగలిగామని దర్శకుల్లో ఒకరైన కిరణ్ తెలిపారు. మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ వద్ద పనిచేసిన మైఖేల్ గురువులు గర్వించేవిధంగా బాణీలు సమకూర్చాడనీ, పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయనీ సీతారామశాస్త్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు అల్లాణి శ్రీధర్, క్రిష్, మధుర శ్రీధర్, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఫిల్మ్‌చాంబర్ కార్యదర్శి కె. అశోక్‌కుమార్, సంగీత దర్శకులుఆర్పీ పట్నాయక్, రఘు కుంచే, మైఖేల్ మక్కల్, నటుడు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.