Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘మిరపకాయ్’ పాటలు
''నేను చేసిన 'కిక్‌' సినిమా తర్వాత బాగా కిక్కిచ్చే పాటలు 'మిరపకాయ్‌'లో ఉన్నాయి. నా సినిమా అని కాదు కానీ... నిజంగానే ఇందులో పాటలు చాలా బాగున్నాయ''న్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'మిరపకాయ్‌'. రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ కథానాయికలు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. రమేష్‌పుప్పాల నిర్మాత. తమన్‌ స్వరాలు అందించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. రామ్‌గోపాల్‌ వర్మ తొలి క్యాసెట్‌ను ఆవిష్కరించారు. వి.వి.వినాయక్‌ అందుకొన్నారు. తొలి సీడీని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్‌ విడుదల చేయగా రాజమౌళి స్వీకరించారు. దర్శకుడు మాట్లాడుతూ ''మా నిర్మాతలు చెప్పిన సమయం కంటే ఇరవై రోజులు ముందుగానే సినిమాను పూర్తిచేశాం. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మాస్‌ మహరాజ్‌ రవితేజ. ఆయన చెప్పిన పేరే 'మిరపకాయ్‌'. తమన్‌ చక్కటి సంగీతం అందించాడ''న్నారు. ''ప్రతి ఒక్కరూ ఇది నా సొంత సినిమా అనుకొని పనిచేశారు. నా మిత్రుడు నిర్మాత వెంకట్‌ అందించిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించా. తమన్‌ సంగీతం చాలా బాగుంద''న్నారు నిర్మాత. రవితేజ మాట్లాడుతూ ''నాకు బాగా ఇష్టమైన వ్యక్తి హరీష్‌శంకర్‌. తనలో మంచి నటుడున్నాడు. నా కోసం కాకపోయినా హరీష్‌కోసం ఈ సినిమా ఆడాలి. తమన్‌ మరోసారి సినిమాకు తగ్గ పాటలు అందించాడు. రమేష్‌ పుప్పాల మంచి నిర్మాత. తనతో మరిన్ని సినిమాలు చెయ్యాలనుంద''న్నారు. ''దర్శకుడు హరీష్‌, హీరో రవితేజ, సంగీత దర్శకుడు తమన్‌.. ఇలా ప్రతిభ కలిగిన వ్యక్తులు పనిచేశారు. పాటలతో పాటు, సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంద''ని ఆకాంక్షించారు అతిథులు.

దర్శక వైరస్‌లు..: నాగబాబు
''నిర్మాత అనేవాడు లేకపోతే చిత్ర పరిశ్రమ సర్వ నాశనమైపోతుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేదట అని చరిత్రలో మనం చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది. నిర్మాత డబ్బు పెడుతుంటే... ఎన్నిరోజుల్లో సినిమా తియ్యాలి? అనే ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకులున్నారు. శరీరంలోకి చేరే వైరస్‌లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయచేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన రామ్‌గోపాల్‌ వర్మను ఆదర్శంగా తీసుకొని పనిచెయ్యండ''ని 'మిరపకాయ్‌' వేడుకలో ఆవేశంగా మాట్లాడారు నాగబాబు. ఈ కార్యక్రమంలో డా||డి.రామానాయుడు, సి.కల్యాణ్‌, సునీల్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com