ఆడియో
 
 
 
 
పెళ్లి వాతావరణంలో 'మొగుడు' పాటలు విడుదల
‘‘ ‘మగాళ్లందరూ కేవలం మగాళ్లుగా మిగిలిపోతున్నారు కానీ మొగుళ్లు కాలేకపోతున్నారు’ అనేసి.. కొత్తగాపెళ్లి చేసుకున్న నాలో కొత్త భయాన్ని క్రియేట్ చేశారు కృష్ణవంశీ. కేవలం మగాడిగా మాత్రమే కాక మంచి మొగుడుగా కూడా పేరు తెచ్చుకుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను’’ అని ‘మొగుడు’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ -‘‘నా కెరీర్‌లో ది బెస్ట్ కేరెక్టర్ అంటే ‘రాఖీ’లోని రామకృష్ణ పాత్రే. ఆ పాత్ర నాకిచ్చిన కృష్ణవంశీ అన్నయ్యను మరచిపోలేను.

ఆయన నా మిత్రుడు గోపీచంద్‌తో ‘మొగుడు’ సినిమా తీయడం ఆనందంగా ఉంది. నాకు ‘రాఖీ’లా, గోపీ కెరీర్‌లో ‘మొగుడు’ నిలిచిపోవాలనేది నా ఆకాంక్ష. అలాగే నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌కి ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టాలి’’ అని అభిలషించారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడానికి పదేళ్లు ఎదురుచూశాను. నా తొలిసినిమా ఫ్లాప్ అయ్యాక నేను తొలుత కలిసింది ఆయన్నే. ‘తప్పకుండా చేద్దాం గోపీ’ అని నాకు ధైర్యం చెప్పేవారు. ఓసారి ‘నీతో మంచి యాక్షన్ సినిమా చేస్తా’ అన్నారు. నాకు యాక్షన్ సినిమా వద్దు. కొత్త తరహా సినిమా కావాలని అడిగాను.

నేను కోరుకున్నట్టు ఇప్పుడు ‘మొగుడు’ చేశారు. రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి గొప్ప నటులతో నటించే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు కలిగింది. బాబూశంకర్ అద్భుతమైన సంగీతం అందించారు.’’ అని చెప్పారు. ‘‘కార్యేషు దాసి, కరణేశు మంత్రి... అంటూ భార్యకు ఉండాల్సిన లక్షణాలను చెప్పారు కానీ మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలు మాత్రం ఎవరూ చెప్పలేదు. అసలు ఒక భార్య తన భర్త నుంచి ఏమి కోరుకుంటుంది అనే విషయాన్ని చర్చిస్తూ ఈ సినిమా తీశాను’’ అని కృష్ణవంశీ చెప్పారు.

టైటిల్ లోగోను డి.సురేష్‌బాబు, ట్రైయిలర్‌ను డా.రాజేంద్రప్రసాద్, ఆడియో సీడీని ఎన్టీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాప్సీ, అనుష్క, లక్ష్మీప్రసన్న, వీవీ వినాయక్, అల్లు అరవింద్, దిల్‌రాజు, కేఎల్ నారాయణ, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, ఠాగూర్ మధు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, రోజా, గీతాంజలి తదితరులు కూడా పాల్గొన్నారు.