ఆర్.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చలపతి మల్లాది దర్శకత్వంలో ఎ.కె.సాయికుమార్ నిర్మిస్తున్న 'మిస్టర్ లవంగం' చిత్రం ఆడియో సీడీలను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. హాస్యనటుడు, రచయిత తనికెళ్ల భరణి కుమారుడు తేజ తనికెళ్ల ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండగా, హీరోయిన్ సింధు. ఆడియోను హీరో శ్రీహరి విడుదల చేసి తొలి సిడిని చలపతిరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ- "ఈ చిత్రం టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. నిజంగా నిర్మాత ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు సంగీత దర్శకుడు. తప్పకుండా ఆడియో హిట్ అవుతుంది. సినిమా తీయడంతోనే నిర్మాత పని అయిపోలేదు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి. సరైన ప్రణాళికతో సినిమాకు పబ్లిసిటీ చేసుకోవాలి. అప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. తనికెళ్ల భరణి సినీ పరిశ్రమలో ఎంతో మందిని ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సులతోనే ఈ రోజు ఇంత వాళ్లమయ్యాం. తప్పకుండా ఆయన కుమారుడు తేజ కూడా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందుతాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది'' అన్నారు.
నిర్మాత ఎ.కె.సాయికుమార్ మాట్లాడుతూ- "సినిమా నిర్మాణంలో అనుభవం లేకున్నా... ఎంతో కష్టపడి అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేశాం. పరిశ్రమలోని అందరి సహకారం వల్లే ఇది సాధ్యం అయింది. హీరో తేజ మంచి నటుడు. పైకి చూడటానికి సైలెంట్‌గా ఉంటాడు... కానీ రియల్‌లైఫ్‌లో నాటీ బాయ్. ఎలాంటి క్యారెక్టర్లైనా చేయగలడు'' అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ- "కుమారుని చేతిలో ఓడిపోవడం ఓ వరం. నటనలో నా కుమారుడు నన్ను ఓడించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది'' అన్నారు.
హీరో తేజ మాట్లాడుతూ- "ఒక డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇందులో నేను వేసిన ఆడవేషం అందిరినీ నవ్విస్తుంది'' అన్నారు.
బ్రహ్మానందం, క్రిష్ణ భగవాన్, చలపతిరావు, సుమన్‌శెట్టి, మెల్కోటి, రంగనాథ్, కొండవలస, గౌతంరాజు, ఛత్రపతి శేఖర్, పృథ్వీ, ధన్‌రాజ్, రాజేంద్ర, ఇంటూరి వాసు, పూర్ణిమ, పావల శ్యామల, ఉమ, అను, సంధ్య, మధుర, వనిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె.రిషాల్ సాయి, కో-ప్రొడ్యూసర్: జి.కె.కిశోర్, ఫొటోగ్రఫీ: టి.రాజేంద్ర, ఎడిటర్: నందమూరి హరి: రచన, దర్శకత్వం: చలపతి మల్లాది.