కార్తి, కాజల్ జంటగా సుసీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం 'నా పేరు శివ'. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. తెలుగులోకి స్టూడియో గ్రీన్ సంస్థ అనువదిస్తోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తొలి సీడీని కార్తి ఆవిష్కరించారు. వెన్నెలకంటి అందుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ "మేం గతంలో తీసిన చిత్రాలకు విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగులో ఇది మా నాలుగవ చిత్రం. తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ అభినందనలు.
తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది'' అని అన్నారు. కార్తి మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని ఓ లైఫ్ లాగా ప్రజెంట్ చేశారు. మన దేశంలో ముప్పావు వంతు మధ్యతరగతి కుటుంబాలే. ప్రేమ తప్ప అన్నీ తక్కువే ఉంటాయి వారికి. ఇందులో నేను మధ్య తరగతి యువకుడిగా నటిస్తున్నాను. చెడు సంఘటన కారణంగా నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరం. వాణిజ్య విలువలు పుష్కలంగా ఉంటాయి. మహిళలకు బాగా నచ్చుతుంది. యువన్ సంగీతం ఆకట్టుకుంటుంది. రీరికార్డింగ్ మెప్పిస్తుంది. త్వరలో నా పెళ్ళి జరగనుంది. అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను.
ఈ సినిమా వచ్చేనెల 22న విడుదల కానుంది'' అని చెప్పారు. శశాంక్ మాట్లాడుతూ "సమాజంలో భయపెట్టే కొన్ని ఇజాలే కాకుండా మరికొన్ని విషయాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని తీసుకొని ఈ చిత్రంలో కథనాన్ని మలచారు. పాటలు సినిమాకు హైలైట్. సాహితి మంచి సాహిత్యాన్నిచ్చారు'' అని తెలిపారు. సినిమా ప్రేక్షకాదరణ పొందాలని సాహితి, శ్రీధర్‌రెడ్డి, వెన్నెలకంటి తదితరులు ఆకాంక్షించారు. ఆడియో మధుర ద్వారా విడుదలైంది.