సాధారణంగా పాటల చిత్రీకరణ కోసం సినిమా యూనిట్‌లు బ్యాంకాక్ వెళ్తుంటాయి. అక్కడ పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్స్ జరుపుతుంటారు. కాని అందుకు భిన్నంగా బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ కోసం వెళ్ళిన 'నమో వెంకటేశ' యూనిట్ తమ చిత్రం ఆడియో వేడుకను బ్యాంకాక్‌లోనే గ్రాండ్‌గా జరిపింది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయకుడు వెంకటేష్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి సీడీని చిత్ర కథానాయిక త్రిషకు అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ -"ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ చాలా చక్కని సంగీతాన్ని అందించాడు. బ్యాంకాక్‌లో ఆడియో ఫంక్షన్ జరగటం ఆనందంగా వుంది. పాటలన్నీ అందర్ని ఆకట్టుకుంటాయి.
శ్రీను వైట్ల ఎంటర్‌టైన్‌మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని పూర్తి వినోదాత్మకంగా ఆయన మలిచాడు' అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ -"ఇంతకు ముందు దేవిశ్రీ ప్రసాద్, నా కలయికలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా వాటికి మించిన విధంగా వుంటాయి. నాకెంతో ఇష్టమైన కథానాయకుడు వెంకటేష్‌తో నేను ఇలాంటి ఓ మంచి చిత్రం చేయడం ఆనందంగా వుంది' అని చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ ఫంక్షన్‌లో చిత్ర యూనిట్‌సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి.