ఆడియో
 
 
 
 
'నాన్న' కూడా ముఖ్యం- అని చెప్పే చిత్రం
విక్రమ్, అనుష్క, అమలా పాల్ కాంబినేషన్‌లో విజయ్ దర్శకత్వంలో శ్రీ రాజకాళియమ్మన్ మీడియాస్‌పై మోహన్ నటరాజన్ సమర్పణలో ఎం. చింతామణి నిర్మిస్తున్న చిత్రం ‘నాన్న’. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణలో వీవీ వినాయక్, క్రిష్, కరుణాకరన్, భోగవల్లి ప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. ఆడియో సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి క్రిష్, కరుణాకరణ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘విక్రమ్ నటించిన ‘9 నెలలు’కి నేను కో-డెరైక్టర్‌గా చేశాను.

తనతో నాకు మంచి స్నేహం ఉంది. ‘శేతు’లో విక్రమ్ నటన చూసి సూపర్ స్టార్ అవుతాడనుకున్నాను. కమల్‌హాసన్‌లాంటి నటుడు మళ్లీ వస్తాడా అనుకున్నాను. ఆ లోటుని విక్రమ్ తీర్చాడు’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ -‘‘నేను దర్శకుల హీరోని. దర్శకులు ఎలా చెబితే అలా చేస్తాను. ఇది ట్రికీ సబ్జెక్ట్. కామెడీ, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మామూలుగా అమ్మ గొప్పతనాన్ని చెబుతారు. నాన్న కూడా మన జీవితానికి ముఖ్యం అని చెప్పే చిత్రం ఇది’’ అని చెప్పారు.

‘‘విక్రమ్ గొప్ప నటుడు. దర్శకుడు విజయ్ మా నుంచి మంచి నటనను రాబట్టారు’’ అని అనుష్క అన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామని మోహన్ నటరాజన్ అన్నారు. విజయ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా నాకిది నాలుగవ సినిమా. విక్రమ్‌తో సినిమా చేయాలన్న నా కల ఇంత త్వరగా నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ఇంకా ఈ వేడుకలో అమలాపాల్, జీవీ ప్రకాష్‌కుమార్ తదితర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.