అనిష్ తేజస్విన్, బార్బి నాయకానాయికలుగా అనుష్క ప్రొడక్షన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘నిను చూసిన క్షణాన’ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. లహరి ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటల సిడిని నిర్మాత మళ్ళ విజయప్రసాద్ ఆవిష్కరించి మరో నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణకు అందజేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల మధ్య నడిచే ప్రేమ కథ. ఇది అన్ని ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా స్వచ్ఛమైన ప్రేమకు అద్ధం పట్టే విధంగా వుంటుంది. హీరోయిన్ రవళి సోదరుడు విజయ్ ఈ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయమవుతున్నారు. యాంకర్ రవిత్రయణి లేడీ విలన్‌గా కనిపిస్తుంది. సైరాభాను హీరోను కవ్వించే పాత్రలో నటిస్తూ అందాలు ఆరబోసింది. సినిమా చూసేవారికి ఒక కొత్త ఫీల్ వున్న సినిమా చూసామనే భావన కలుగుతుంది. సాయి కార్తీక్ చాలా మంచి సంగీతం అందించారు’’ అన్నారు. కథానాయకుడు అనిష్ మాట్లాడుతూ ‘‘తెలుగులో నటించాలనే నా చిరకాల కోరిక ఈ చిత్రం ద్వారా తీరింది. మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాయికార్తీక్, సాయి వెంకట్, రచయిత చందు తదితరులు పాల్గొన్నారు.