సాయికుమర్ తనయుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ..ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో
మాక్స్‌ఇండియా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమ కావాలి’. కె.విజయభాస్కర్ దర్శకుడు.
అచ్చిరెడ్డి నిర్మాత. ఇషాచావ్లా కథానాయికగా పరిచయమవుతోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా
గీతాల్ని ఆవిష్కరించారు. ఆడియో వేడుకలో డాదాసరి నారాయణరావు, పి.జె.శర్మ,
సాయికుమార్, టివి9 రవిప్రకాష్, రమేష్ పుప్పాల, జయసుధ, బ్రహ్మానందం, ఆది, ఇషాచావ్లా,
అనూప్ రూబెన్స్ (సంగీతదర్శకుడు), విజయ భాస్కర్, కె.అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, మనోజ్,
లక్ష్మీప్రసన్న, వరుణ్‌సందేశ్, శర్వానంద్, సందీప్, గౌతంరాజు, చోటా.కె.నాయుడు, దేవకట్టా,
మయూరి తదితరులు పాల్గొన్నారు.
దాసరి తొలిసిడిని ఆవిష్కరించి కథానాయకుడు ఆదికి అందించారు. అనంతరం దాసరి
మాట్లాడుతూ ‘సాయికుమార్ కుటుంబం చిత్రపరిశ్రమకే అంకితమైంది. ఆయన తల్లిదండ్రులు,
సోదరులు అంతా తెలుగు పరిశ్రమకు చెందిన కుటుంబం. నేడు తనయుడు ఆదిని హీరోని
చేస్తున్నాడు. ఇక్కడ ఓ హీరోని పరిచయం చేయడం సామాన్య విషయం కాదు. సామాన్యులు
హీరోలు అవ్వడం అనేది చాలా అరుదు. 50ఏళ్లుగా సినిమాకి సేవ చేస్తున్న ఈ కుటుంబం
నుంచి వస్తున్న హీరోని కచ్ఛితంగా మనం ఆదరించాలి. అది మనం ఇచ్చే కానుక. అదేవిధంగా
ఆదిని ప్రమోట్ చేస్తున్న ఆర్.ఆర్ సంస్థ సేవాకార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి
అరుదైన సంస్థనుంచి ఆది హీరోగా పరిచయం కావడం అదృష్టం’ అన్నారు.
జయసుధ
మాట్లాడుతూ ‘సాయికి తల్లిగా నటించాను.
ఆ అభిమానంతో ఆది సినిమాలో ఒకే సన్నివేశం అయినా..నటించాను’ అన్నారు. బ్రహ్మానందం
మాట్లాడుతూ ‘ఆది డాన్సులు, ఫైట్లు సహా అభినయం బాగా పండించాడు. కలిసి చేసిన కొన్ని
సన్నివేశాల్లో అతడిని స్పష్టంగా పరిశీలించాకే ఇది చెబుతున్నా. మంచి భవిష్యత్ ఉంది’
అన్నారు. యువకథానాయకులంతా ఆదికి శుభాకాంక్షలు అందిస్తూ.. డాన్సుల్లో విశేష ప్రతిభ
ఉన్న ఆది హీరోగా సక్సెసవ్వాలని ఆకాంక్షించారు.
ఆది మాట్లాడుతూ ‘అనూప్ సంగీతం
అద్భుతం. నన్ను సినిమాకి పరిచయం చేస్తున్న పెద్దలు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.
నాకు మీ అందరి -ప్రేమకావాలి’ అన్నారు.
అదే వేదికపై..ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా బ్రోచర్‌ను
ఆవిష్కరించారు. రూ.10లక్షలను ఆర్.ఆర్ సంస్థ కేన్సర్ రోగుల సహాయార్థం దాసరి
చేతులమీదుగా అందించింది. ఎయిర్‌టెల్ ‘యూత్‌స్టార్’ అవార్డులు అందుకున్న విజయ్,
సూర్యకార్తిక్, రవి, మానిక్, అభిరామ్, శారదా రాణి..విదేశీ పర్యటనకు ఎంపికయినట్లు టీమ్
ప్రకటించింది. |