'జబ్ వి మెట్' చిత్రాన్ని తమిళంలో 'కండేన్ కాదలై' పేరుతో పునర్నిర్మించారు. భరత్, తమన్నా జంటగా నటించారు. ఈ
చిత్రాన్ని తెలుగులో 'ప్రియా ప్రియతమా' అనే పేరుతో భద్రకాళి ఫిలిమ్స్ సంస్థ అనువదిస్తోంది. భద్రకాళి నిర్మాత. ఆర్.కణ్ణన్
దర్శకత్వం వహించారు. తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. డాక్టర్ దాసరి నారాయణరావు
తొలి సీడీని విడుదల చేశారు. తొలి ప్రతిని తమన్నాకు అందజేశారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ "డబ్బింగ్ సినిమాలు మన సినిమాలను దెబ్బతీస్తున్నాయన్నది నా
అభిప్రాయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. 'హ్యాపీడేస్' సమయంలోనే తమన్నా పెద్ద నాయిక అవుతుందని
చెప్పాను. ఇటీవల వచ్చిన '100% లవ్'లోనూ బాగా నటించింది. పాటలు బాగున్నాయి. ఇది డబ్బింగ్ చిత్రంలా లేదు. ఈ
నిర్మాత భవిష్యత్తులో ప్రత్యక్ష సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ "దాసరిగారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు జీవితాంతం రుణఫడి ఉంటాను. త్వరలో
రజనీకాంత్ 'బాషా' చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నాం. 'ప్రియా ప్రియతమా' చిత్రాన్ని అందరూ ఆదరించాలని
కోరుకుంటున్నాను'' అని అన్నారు. "మంచి సంగీతం కుదిరింది. యూనిట్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.
చాలా కష్టపడి చేసిన ఈ సినిమా తెలుగులోనూ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను'' అని తమన్నా చెప్పారు.
సినిమా విజయవంతం కావాలని రోజారమణి, కుమారచౌదరి తదితరులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వడ్డే రమేష్,
డీజీపీ ఈస్ట్ జోన్ గంగాధర్, చక్రపాణి, యన్.ఆర్.అనురాధాదేవి, యుటివి శివప్రసాద్, రాశీ మూవీస్ నర్సింహారావు,
గీతాంజలి, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. పాటలు ఆదిత్య ద్వారా విడుదలయ్యాయి.