''పరమవీరచక్ర చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే... నేను పెద్దాయన ఎన్టీఆర్‌తో సినిమా
చేస్తున్నట్లే అనిపించింది. ఇందులో బాలకృష్ణ విశ్వరూపాన్ని చూస్తారు. దర్శకుడికి ఆయన
ఇచ్చే గౌరవం అంతా కాదు. ఒక మంచి విద్యార్థిలా ఉంటాడు. ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ నేను
బాలకృష్ణలో చూశాను'' అన్నారు దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వంలో
రూపొందుతున్న చిత్రం 'పరమవీరచక్ర'. బాలకృష్ణ కథానాయకుడిగా నటించారు. అమీషా
పటేల్, నేహాధూపియా, షీలా కథానాయికలు. సి.కల్యాణ్ నిర్మాత. మణిశర్మ స్వరాలు
సమకూర్చారు. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ అందుకొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు కె.బాలచందర్‌తోపాటు రామ్‌నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దాసరి మాట్లాడుతూ ''సింహా గర్జన తర్వాత వస్తున్న విజయ సింహ గర్జన ఇది.
ఎన్టీఆర్‌తో ఆరు సినిమాలు రూపొందించాను. అందులో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకొనే చిత్రాలు
బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ నా రాజకీయ జీవితానికి కారణమైన చిత్రాలు ఆ
రెండు అని ఎప్పుడూ చెప్పేవారు. ఒక దర్శకుడిగా నాకు అంతకంటే ఆనందం మరొకటి లేదు.
బాలకృష్ణతో కలిసి ఇప్పటి వరకూ ఎందుకు సినిమా చేయలేదో? అది నా 150వ సినిమాతోనే
ఎందుకు కుదిరిందో... నాకు ఇప్పుడు అర్థమవుతోంది. బాలయ్యలోని ఓ మహానటుడిని
ఆవిష్కరించిన తృప్తి ఈ సినిమాతో నాకు కలిగింది. అనుకొన్న సమయంలో అనుకొన్న బడ్జెట్‌లో
సినిమాను పూర్తి చేశాం. ఒక మంచి కథలో నటిస్తే చూడ్డానికి మేం సిద్ధంగా ఉన్నామని సింహాతో
రుజువు చేశారు ప్రేక్షకులు. పరమవీరచక్ర గురించి ఇప్పుడు నేనేమీ మాట్లాడను. నా సినిమానే
మాట్లాడుతుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించార''న్నారు.
బాలకృష్ణ ప్రసంగిస్తూ ''అభిమానులు పండగ వేడుకను ముందే చేసుకొంటున్నారు. దాసరి దర్శకత్వంలో నేను
శివరంజని సినిమాలో నటించాల్సింది. అయితే అప్పుడు నేను చదువుకొంటున్నందువల్ల
నాన్నగారు వద్దని చెప్పారు. యాధృచ్ఛికమో, కాకతాళీయమో ఆయన దర్శకత్వంలో
వస్తున్న 150 చిత్రంలో నా 50వయేట నటించా. కొమరం భీమ్, సైనికుడు, నటుడు
ఇలా పలు పాత్రల్లో కనిపిస్తా. రావణబ్రహ్మగా చేసిన మరో పాత్ర ఉంది. అది పౌరాణికాలను
నాంది పలికేలా ఉంటుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించార''న్నారు.
ఎన్టీఆర్
మాట్లాడుతూ ''ఇందులోని కొన్ని సన్నివేశాలను చూసే అవకాశం నాకు దక్కింది. నిజంగా
రెండు కళ్లు చాల్లేదు. బాబాయ్ అద్భుతంగా నటించార''న్నారు.
ఇదే వేదికపై
బాలచందర్, రామ్‌నారాయణలని సత్కరించారు. దేశరక్షణలో అవయవాలు కోల్పోయిన
సైనికులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, వినాయక్,
కల్యాణ్‌రామ్, తారకరత్న, షీలా, బోయపాటి శ్రీను, బి.గోపాల్, కేఎస్ రామారావు,
తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.