హరనాథ్ పొలిచెర్ల కథానాయకుడిగా పిహెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో హరనాథ్ నిర్మించిన చిత్రం ‘రాజేంద్ర’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఆడియో సీడీని హీరో చిరంజీవి ఆవిష్కరించి, తొలి కాపీని నిర్మాత డి.రామానాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ -‘గతంలో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనేవారు. కానీ ఇప్పుడు రక్తదానం, శ్రమదానంతోపాటుగా అవయవ దానం కూడా గొప్పది అంటున్నారు. ఒక మనిషి అవయవాలతో తొమ్మిది మందికి ప్రాణం పోయవచ్చు. అలాంటి స్ఫూర్తిచేత గతంలో బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాను. సమాజంలో ఇటువంటి ఆలోచన అందరిలో రావాలని ఈ చిత్రంలో హీరో సందేశంతోపాటుగా మంచి చిత్రంగా నిర్మించారని తెలిసింది. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన’ని వివరించారు.
కథానాయకుడు, దర్శక నిర్మాత హరనాథ్ మాట్లాడుతూ -‘దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడి ఈ కథ రాసుకున్నాను. కోటి ఈ కథకు తగిన విధంగా పాటలు అందించారు. నా తోటి నటీనటులందరూ ఈ కథ నచ్చి సహకరించి నటించారు. కమర్షియల్ సినిమా తీస్తూ సందేశాన్ని కూడా ఇవ్వాలని, మనస్సుకు హత్తుకునే విధంగా సినిమాలు నిర్మించాల’ని నా కోరిక అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కథా నాయికలు గౌరీ పండిట్, జయతి, రూబీ పరిహార్, జుబీన్‌ఖాన్, ఎంఎల్‌ఎ అనీల్, సతీష్, అమర్‌నాథ్ గౌడ్, రఘు కుంచె, శివశక్తి దత్త తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, జయప్రకాష్‌రెడ్డి, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, మధు, గీతాసింగ్, ఎమ్మెస్ నారాయణ, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాట లు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు: అనంతశ్రీరామ్, వనమాలి, సుద్దాల, సంగీతం: కోటి, కెమెరా: శరత్, ఎడిటింగ్: లోకేష్‌చెన్న, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: హరనాథ్ పొలిచర్ల.