వేణు తొట్టెంపూడి ‘రామాచారి’గా రానున్న విషయం తెలిసిందే. ‘ఈడో పెద్ద గూఢచారి’ అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ ఘనాపాటి
దర్శకత్వంలో పి.వి.శ్యాంప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల విడుదల గురువారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ నటుడు బాలయ్య
ఆడియో సీడీని ఆవిష్కరించి, తమ్మారెడ్డి భరద్వాజ్‌కి అందించారు. కొంత గ్యాప్ తీసుకొని వేణు, శ్యామ్‌ప్రసాద్ తీసిన ఈ చిత్రం చక్కని
విజయం సాధించాలని భరద్వాజ్ ఆకాంక్షించారు.
ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మంచి పాత్ర పోషించానని బాలయ్య అన్నారు. రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా
ఇదని, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారని, కచ్ఛితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘ఈ
సంస్థలో నాది ఆరవ చిత్రం. మలయాళంలో పెద్ద విజయం సాధించిందీ సినిమా. ఈ సినిమా రైట్స్‌ని ముందు భీమినేని శ్రీనివాసరావు
గారు దక్కించుకున్నారు. మేం అడగ్గానే... కాదనకుండా రైట్స్ మాకిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు.
చాలా గ్యాప్ తర్వాత పూర్తి వినోదాత్మక చిత్రంతో వస్తున్నాం. దర్శకుడు నేటివిటీకి తగ్గట్టుగా చక్కగా తీశాడు. మణిశర్మ సంగీతం ఈ
సినిమాకు వెన్నెముక. నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని వేణు తెలిపారు. కె.విజయభాస్కర్, అలీ, రామ్‌ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి,
గాయకుడు వేణు, విశ్వ, కిషోర్‌దాస్, మోహన్‌దాస్, హర్షవర్థన్, అమిత్, ధీరజ్ అప్పాజీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.