ఆడియో
 
 
 
 
జీవా 'రంగం' పాటలు
ఆర్‌.బి. చౌదరి సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌ బ్యానర్‌లో ఆర్‌ఎస్‌.ఇన్ఫోటైన్‌మెంట్స్‌ సంస్థ కుమార్‌, జయరామ్‌రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రజల్ని ప్రభావితం చేసే రంగాల్లో మీడియాకు మొదటిస్థానం దక్కుతుంది. జర్నలిజం చుట్టూ నడిచే సబ్జెక్టుతో తమిళ నటుడు జీవా ఓ సినిమా తీశాడు. ఫోటో జర్నలిజం అనే సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో 'కో' అనే పేరుతో వస్తోంది. దీన్ని తెలుగులో 'రంగం' అనే పేరుతో అనువదిస్తున్నారు. వచ్చేనెలలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోన్న ఈ చిత్రానికి కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈయన ఫొటో జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించారు. ఆర్‌.బి.చౌదరి కుమారుడు జీవా హీరోగా రాధ కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటించారు. వీరితోపాటు పియాబాజ్‌పాయ్, అజ్మల్‌ అమీర్‌ మరో జంటగా నటించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వి.వి.వినాయక్‌ సీడీని విడుదల చేసి డి.సురేష్‌బాబుకు అందజేశారు.

వినాయక్‌ మాట్లాడుతూ...'ఆర్‌.బి. చౌదరి ఎంతోమందిని ఇండిస్టీకి పరిచయం చేశారు. వారబ్బాయి నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. జీవ చాలా మంచి నటుడు. అతను నటించిన తమిళ చిత్రాన్ని చూశాను. హరీష్‌ జైరాజ్‌ చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమాలో పనిచేసిన అందరికీ విజయం దక్కాలని కోరుకుంటున్నా'నని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన కుమార్‌ మాట్లాడుతూ...'ఫొటో జర్నలిజం రాష్ట్ర రాజకీయాల్ని ఎలా మార్చేసిందన్నది కథలోని ముఖ్యమైన పాయింట్‌. దర్శకుడు తనకున్న అనుభవాన్ని రంగరించి 'రంగం'గా మార్చారు. సాంకేతిక నిపుణులు చక్కగా పనిచేశారు. చైనాకు వెళ్లి కొన్ని సన్నివేశాల్ని తీశాం' అని చెప్పారు.

హరీష్‌జైరాజ్‌ మాట్లాడుతూ...'నేను సంగీతం వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరగటం చాలా ఆనందగా ఉంది. హైదరాబాద్‌ అంటే ఎంతో ఇష్టం. దర్శకుడు టాలెంటెడ్‌. తెలుగులో నా గత చిత్రాలమాదిరిగానే ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా'నని అన్నారు.

దర్శకుడు కె.వి.ఆనంద్‌ మాట్లాడుతూ... 'దర్శకుడిగా రాక ముందు ఫొటోజర్నలిస్టుగా పలు పత్రికల్లో పనిచేశాను. అప్పట్లో 9 మంది ప్రముఖ ముఖ్యమంత్రుల ఫొటోలను కవర్‌ చేయగలిగాను. ఈ చిత్ర కథాంశంకూడా అటువంటిదే. వృత్తిలో ఎదురయ్యే సాధకబాధలు ఎలా ఉంటాయనేది చూపించాం. హరీష్‌జైరాజ్‌ సంగీతం చాలా బాగుంది. కొన్ని పాటలను విదేశాల్లో చిత్రించాం. జీవా మంచి అభినయాన్ని చూపాడు. మరో హీరోగా ఆజ్మల్‌ నటించాడు. త్వరలో విడుదల కానుంది' అని చెప్పారు.

గీత రచయిత వనమాలి మాట్లాడుతూ...'ఆరెంజ్‌' సంగీతపరంగా హిట్‌. ఆ తరువాత హరీష్‌ చేసిన చిత్రమిది. డైరెక్టర్‌కి తెలుగు రాకపోయినా అర్థం చేసుకుని నాచేత పాటలు రాయించాడు. రాజకీయ రంగానికి జర్నలిజానికి సంబంధించిన కథ ఇది. ఈ ఆడియోతోపాటు సినిమాకూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా'నని అన్నారు.

హీరో జీవా మాట్లాడుతూ...'ఇంతకుముందు 'ఈ' చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యాను. త్వరలో స్ట్రెయిట్‌ సినిమా చేస్తాను. దర్శకుడు ఆనంద్‌ వద్ద చాలా నేర్చుకున్నా. సహ నటుడు అజ్మల్‌ నుంచీ నేర్చుకున్నాను. హరీష్‌జైరాజ్‌ చక్కటి సంగీతాన్ని అందించారు' అని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సోనా హెడెన్, జగన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సంగీతం : హరీష్ జైరాజ్, కెమెరామెన్ : రిచర్డ్ నితిన్, మాటలు : శ్రీరామకృష్ణ, పాటలు : వనమాలి, ఎడిటింగ్: ఆంథోని, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, డాన్స్ మాస్టర్స్: దినేష్, బృంద, గాయత్రి రఘురామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : జేమ్స్, నిర్మాతలు : కుమార్- జయరామిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కె.వి.ఆనంద్.