ఆడియో
 
 
 
 
ప్రసాద్ సంస్థ సినిమాలను తేలిగ్గా తీసుకోదు

‘‘మూడు దశాబ్దాల తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్‌వారు సినిమా తీస్తున్నారు అనగానే... నన్ను హీరోగా పిలుస్తారనుకున్నాను. కానీ వేరే హీరోతో సినిమా చేసి నన్ను ఆడియో వేడుకకు అతిథిగా పిలిచారు (నవ్వుతూ). ఈ సంస్థతో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఈ సంస్థ నిర్మించిన ‘ఏక్ దుజేకేలియే’ ద్వారానే నేను బాలీవుడ్‌కి పరిచయం అయ్యాను. ప్రసాద్ సంస్థ సినిమాలను తేలిగ్గా తీసుకోదు. ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చేస్తారు. నేను నటించిన ఒక సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గారిని నటించమని అడిగాను. నేనా? అని, ‘స్క్రిప్ట్ రైటర్ రాస్తే చేస్తా’ అన్నారు. ఆ విధంగా నా సినిమాలో ఆయన నటించారు.

సుదీర్ఘ విరామం తర్వాత ప్రసాద్ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అని కమల్‌హాసన్ అన్నారు. అరవింద్‌కృష్ణ, సుప్రియా శైలజ జంటగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేష్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఋషి’. స్నిగ్థ, డాన్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమల్‌హాసన్ ఆడియోను ఆవిష్కరించి, తొలి ప్రతిని డి.రామానాయుడుకి అందించారు. ఈ సందర్భంగా కమల్ పై విధంగా స్పందించారు. 30 ఏళ్ల తర్వాత ప్రసాద్ సంస్థ తీసిన ఈ సినిమా విజయం సాధించాలని రామానాయుడు ఆకాంక్షించారు.

రమేష్‌ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్‌గారు మూకీ నాటినుంచి సినిమాలు ఆరంభించారు. ఆరోగ్యకరమైన చిత్రాలను తీసే సంస్థగా మా సంస్థకు పేరుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాను. 30 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేయడానికి కారణం కథ నచ్చడమే. కమల్‌తో మాకున్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. తను చాలా క్రియేటివ్. అలాగే ఇక్కడకు విచ్చేసినందుకు రామానాయుడుగారికి ధన్యవాదాలు. మంచి సినిమా తీశాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఇంకా ఈ వేడుకలో ‘ఋషి’ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు