"పేరుకు తగ్గట్టు సంచలన విజయం ఈ సినిమాకు 'సాధ్యం'. కథ, కథనాల పరంగానూ, పాత్రల తీరుతెన్నుల పరంగానూ దర్శకుడు కొత్తగా మలిచాడు. ముఖ్యంగా ప్రియమణి ఇందులో చాలా అందంగా కనిపించింది. ఆమెతో నేను చేసిన పెళ్ళైనకొత్తలో, ప్రవరాఖ్యుడు చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. సంగీత దర్శకుడు చిన్ని చరణ్ పాటలను మాత్రమే కాకుండా, నేపథ్య సంగీతం కూడా చక్కగా చేకూర్చాడు. ట్రైలర్‌ని చూసిన తర్వాత ఈ సినిమా అఖండ విజయం సాధించడం ఖాయం అనిపిస్తోంది' అని జగపతిబాబు నమ్మకం వ్యక్తపరిచారు.
జగపతి, ప్రియమణి జంటగా... కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో, కుమార్‌బ్రదర్స్ నిర్మించిన 'సాధ్యం' చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా జగపతిబాబు పై విధంగా స్పందించారు. ఆడియో సీడీని బెల్లంకొండ సురేష్ ఆవిష్కరించి జగపతిబాబుకు, కేసెట్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి లగడపాటి శ్రీధర్‌కి అందించారు. సినిమా ఘన విజయం సాధించి నిర్మాతలకు ఆర్థిక లాభాలు చేకూర్చాలని, పనిచేసిన అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని వారు ఆకాంక్షించారు. ప్రియమణి మాట్లాడుతూ -"ఇది నాకు ఖచ్చితంగా భిన్నమైన పాత్ర. చక్కని పాత్రనిచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. చిన్ని చరణ్ మంచి పాటలు అందించాడు' అని చెప్పారు. "ఈ సినిమా రూపొందించే ప్రక్రియలో నటీనటులను, సాంకేతిక నిపుణులను కాస్త విసిగించానేమో అనిపిస్తుంది. అన్నీ భరించి చక్కని అవుట్‌పుట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు' అని దర్శకుడు తెలిపారు. సంగీత దర్శకుడిగా త నకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చిన్ని చరణ్ థ్యాంక్స్ చెప్పారు. గౌతంరాజు, గణేష్, హరనాథ్, పాండురంగ, మధుర శ్రీధర్, మడూరి మధు, అక్ష, మధుశాలిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధుర ఆడియోస్ ద్వారా ఈ పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.