ఆడియో
 
 
 
 
'సాక్షి' ఆడియో
బీఎస్సార్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'సాక్షి'. రాజా, పోసాని కృష్ణమురళి, రేవ, శిల్ప కీలక పాత్రధారులు. బి.ఎస్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బి.శ్రీనివాసరెడ్డి, వి.రామ్మోహన్ రెడ్డి, ఒ.డి.శర్మ, ఒ.ఎస్.మూర్తి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ ఆవరణలో జరిగింది. రాజా మాట్లాడుతూ "ఈ నవంబర్‌కు నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పది వసంతాలవుతుంది. ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. పరిశ్రమ సహకారం మరువలేనిది. 'సాక్షి' సినిమా సంగీతం, స్క్రిప్టు అందరినీ మెప్పిస్తుంది.

పోసాని ఫైర్ ఉన్న గొప్ప వ్యక్తి'' అని అన్నారు. పోసాని చెబుతూ "నేను పరిశ్రమకొచ్చి పాతికేళ్ళయింది. రచన, దర్శకత్వం తెలుసు కానీ ఎప్పుడూ పాటల జోలికి వెళ్ళలేదు. బాణీలు సంగతి ఎలా ఉన్నా ఆర్.ఆర్. చేయడం కష్టం. ఈ చిత్ర దర్శకుడు సంగీత బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఆయనకు అభినందనలు'' అని అన్నారు. మంచి సినిమా అవుతుందని తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్, రామ్‌ప్రసాద్, బసిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఒ.డి.శర్మ తదితరులు ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ "నేను బాణీలు మాత్రంచేశాను.

నేపథ్య సంగీతం మరొకరు చేశారు. మా నాన్న నిర్మాణ రంగంలో ఉండేవారు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ రంగంలో అడుగుపెడుతున్నాను. ఇది తక్కువ బడ్జెట్ చిత్రమే కానీ తక్కువ సినిమా కాదు. పోసాని, రాజా సహకారం మరువలేనిది. సస్సెన్స్ థ్రిల్లర్ తరహా చిత్రమిది. వెస్టర్న్ కాన్సెప్ట్‌లో ఉంటుంది'' అని అన్నారు. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత సింగిల్ కార్డు పాటలు రాశానని బాపు చెప్పారు. ఈ కార్యక్రమంలో శివరంజని లక్ష్మీనారాయణతో పాటు ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.