ఆడియో
 
 
 
 
'సంఘర్షణ' పాటలు
అల్లరి నరేష్, శశికుమార్, స్వాతి, నివేద కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పోరాళి'. ఈ చిత్రం తెలుగులో 'సంఘర్షణ' పేరుతో విడుదల కానుంది. టింబు ప్రొడక్షన్స్, శ్రీ రంజిత్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేఎల్ దామోదర్‌ప్రసాద్ సమర్పిస్తున్నారు. వేదరాజు టింబర్, అమ్మిరాజు కానుమిల్లి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని భీమినేని శ్రీనివాసరావు విడుదల చేశారు. నాగేశ్వరరెడ్డి అందుకున్నారు. సీడీ లోగోను శ్రీలేఖ ఆవిష్కరించి స్వాతికి అందించారు. ఈ చిత్రాన్ని గురించి దర్శకుడు చెబుతూ "సిన్సియర్ అటెంప్ట్ చేశాం.

మంచి కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, కొంచెం ఎమోషన్ కలగలిసిన సినిమా. నాలుగు ఆసక్తికరమైన పాత్రల చుట్టూ కథ జరుగుతుంది. తమిళంలో నాగేష్ స్థానం ఈ చిత్రంతో నరేష్‌కు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను'' అని అన్నారు. నరేష్ మాట్లాడుతూ "నాన్నగారు నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. 'శంభో శివ శంభో' చూసిన తర్వాత నా కొడుక్కి అంత మంచి కేరక్టర్‌ను నేను కూడా డిజైన్ చేసుకోలేకపోయాను అని సముద్రఖనికి థాంక్స్ చెప్పారట. నాన్నగారు నాతో చివరిగా మాట్లాడినప్పుడు కూడా ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. సముద్రఖని నన్ను చెల్లతంబి (ముద్దుల తమ్ముడు) అని పిలుస్తారు.

సుందర్.సి.బాబు తెలుగు వ్యక్తి. మంచి సంగీతాన్నిచ్చారు. రష్యాకెళ్ళి ఈ సినిమా కోసం రీరికార్డింగ్ చేశారు. డిసెంబర్ 1న గురువారం సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు. అమ్మిరాజు మాట్లాడుతూ "ఈవీవీ ఈ సినిమాను చూసి ఉంటే చాలా సంతోషపడేవారు. నరేష్‌కి చాలా మంచి సినిమా అవుతుంది. మేం అడగ్గానే రైట్స్ ఇచ్చారు. దామూగారికి, టింబర్ గారికి ధన్యవాదాలు'' అని చెప్పారు.

ఓం గణపతి అంటూ చేసిన సంగీతం ఆకట్టుకుంటుందని సుందర్.సి.బాబు అన్నారు. సినిమా విజయం సాధించాలని స్వాతి, శ్రీలేఖ, భీమినేని శ్రీనివాసరావు, నాగేశ్వరరెడ్డి, శర్వానంద్, నందినిరెడ్డి, సీతారామరాజు, చంద్రబోస్, ఉదయ్‌కిరణ్, మధుర అప్పాజీ, తదితరులు ఆకాంక్షించారు. మధుర ద్వారా ఆడియో విడుదలైంది. ఈ కార్యక్రమంలో దామోదర్‌ప్రసాద్, వేదరాజు టింబర్, వివేకానంద కూచిభొట్ల, ఎల్బీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.