Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘‘సరదాగా కాసేపు’’ గీతాలు
నరేష్‌ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరదాగా కాసేపు'. మధురిమ నాయిక. శ్రీనివాస్‌ అవసరాల ముఖ్య భూమిక పోషించారు. శ్రీ కీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.పద్మకుమార్‌ చౌదరి నిర్మిస్తున్నారు. చక్రి స్వరాలు సమకూర్చారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని ఇ.వి.వి.సత్యనారాయణ ఆవిష్కరించారు. జి.నారాయణరెడ్డి స్వీకరించారు. అనంతరం ఇ.వి.వి మాట్లాడుతూ ''నేను వంశీ అభిమానిని. మద్రాస్‌లో ఉన్నప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్లం. సినిమాలకు ఆయన పెట్టే పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. నా సినిమాల పేర్లపై కూడా ఆయన ప్రభావం ఉంటుంది. చాలా విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. వంశీ సినిమా అంటే మొదట పేరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాం. తర్వాత పాటల కోసం. వంశీ అభిమానిగా ఇప్పుడు 'సరదాగా కాసేపు' సినిమాకోసం ఎదురు చూస్తున్నా''అన్నారు. నరేష్‌ మాట్లాడుతూ ''వంశీ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. ఆయన్ని చూస్తూ పెరిగాను. పేరుతో పాటు పాటలూ బాగున్నాయి. సినిమా అంతకంటే బాగుంటుంది. చక్రితో పనిచేయడం ఇది ఐదోసారి. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించే చిత్రమిద''న్నారు. ''ప్రతి సినిమాకూ ఒక కొత్త గాయకుణ్ని పరిచయం చెయ్యడం అలవాటు. ఈసారి వంశీని పరిచయం చేశా. ఆయన ఈ సినిమాలో పాటలు పాడటం నాకు గుర్తుండిపోతుంద''న్నారు చక్రి. ''వంశీ-చక్రి జోడీ నుంచి మరోసారి చక్కటి పాటలు వస్తున్నాయి. ఇందులో నాకూ పాటలు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాన''న్నారు శ్రీనివాస్‌ అవసరాల. ''పాటలు అందరికీ నచ్చుతాయి. చిత్రాన్ని వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో శ్రీలేఖ, ఆహుతిప్రసాద్‌, ఎమ్మెస్‌ నారాయణ, జీవా, కొండవలస, వేమూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.

Next >>
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com