ఆడియో
 
 
 
 
'సీమటపాకాయ్'ఆడియో
నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన 'సీమటపాకాయ్' ఆడియో సీడీలు మధుర ఆడియో ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ల విజయప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం రాత్రి హైటైక్స్‌లో ఆడంబరంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ నిర్మాత డాక్టర్ కె.ఎల్. నారాయణ ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి ప్రతిని సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "నవ్వుకి మించింది లేదు. నాగేశ్వరరెడ్డి, విజయప్రసాద్ లాంటి వాళ్లు లేకపోతే మేం ఈ స్థాయికి వచ్చే వాళ్లం కాదు. నా గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చా. నవ్వుల సినిమాలే డబ్బులు తెస్తున్నాయి. 'సీమటపాకాయ్' పేరుకి తగ్గట్లే ఆడాలని కోరుకుంటున్నా'' అన్నారు. రాజేంద్రప్రసాదే తనకి స్ఫూర్తి అని హీరో నరేశ్ అన్నారు.

తెలుగులో ఇది తనకి రెండో చిత్రమనీ, ఇది తనకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాననీ హీరోయిన్ పూర్ణ అన్నారు. ఈ చిత్రంలో జోకులు సీమటపాకాయిల్లాగా పేలతాయని నటుడు తనికెళ్ల భరణి అన్నారు. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ "చేస్తున్నప్పుడే ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనిపించింది. సంభాషణలతో మరుధూరి రాజా విశ్వరూపం ప్రదర్శించాడు. దర్శకుడు సినిమాని బాగా రక్తి కట్టించాడు.

నరేష్ కి మరో హిట్ గ్యారంటీ'' అని చెప్పారు. నరేష్ కి ఇది సరిగ్గా సరిపోయే టైటిల్ అని హాస్యనటుడు ఏవీఎస్ అన్నారు. ఫ్లాపయిన నరేష్ సినిమా ఇంతవరకు కనిపించలేదని సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని సీమటపాకాయలు (టెన్ థౌజండ్ వాలా) పేల్చడం ద్వారా రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ్, కె.సి. శేఖర్‌బాబు, సి. కల్యాణ్, అశోక్‌కుమార్, దర్శకులు జి. రాంప్రసాద్, శ్రీనివాసరెడ్డి, నందినిరెడ్డి, హరీశ్ శంకర్, ఈశ్వరరెడ్డి, బీవీఎస్ రవి, నటులు నాని, శర్వానంద్, కృష్ణుడు, తనీశ్, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, జీవా, వెన్నెల కిశోర్, రచయిత కోన వెంకట్, చిత్ర నిర్మాత మళ్ల విజయప్రసాద్, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానుమిల్లి అమ్మిరాజు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సంభాషణల రచయిత మరుధూరి రాజా, సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయకుమార్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, కళా దర్శకుడు కె.వి. సుబ్బారావు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.