‘‘భానుమతిగారు, సావిత్రిగారు నటీమణులుగా నిరూపించుకోవడంతో పాటు మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారిని
ఆదర్శంగా తీసుకుని దర్శకురాలిగా మారి తొలి ప్రయత్నంగా ‘మీనా’ సినిమా చేశాను. ఆ చిత్రం విజయం సాధించడంతో వెనక్కి
తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఏ నటీనటులకైనా, సాంకేతిక నిపుణులకైనా మొదటి సినిమా హిట్ అయితే వెనక్కి తిరిగి
చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు.
ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్న అంజనా విజయం సాధించాలని, ఈ చిత్రం 100 రోజులాడి మొత్తం యూనిట్‌కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను’’ అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. నాని, నిత్యామీనన్, బిందు మాధవి కాంబినేషన్‌లో అంజనా దర్శకత్వంలో మాస్టర్ అచ్యుత్ సమర్పణలో అశోక్ వల్లభనేని నిర్మించిన ‘సెగ’ ఆడియో ఆవిష్కరణలో పాల్గొన్న విజయనిర్మల పై విధంగా స్పందించారు. ఈ వేడుకలో రాజశేఖర్, జీవిత, సాగర్, చంద్రసిద్దార్థ్, ప్రసన్నకుమార్, దామోదరప్రసాద్, ఎం.ఎం.శ్రీలేఖ, మహి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
దర్శకురాలు అంజనా మాట్లాడుతూ-‘‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రం చేశాం. ఈ సినిమా ఆరంభించినప్పట్నుంచి అందరూ నన్ను నమ్మి ప్రయాణం చేశారు. ప్రేమ, స్నేహం, పగ, ప్రతీకారం.. ఇలా అన్ని అంశాల సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది’’ అని నాని అన్నారు. ఇంత మంచి చిత్రంలో నటించడంపట్ల నిత్యమీనన్, బింధు మాధవి, కార్తీక్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్రసంగీత దర్శకుడు జోష్వా శ్రీధర్ మాట్లాడుతూ - ‘‘నా తొలి చిత్రం ‘ప్రేమిస్తే’ పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం పాటలు అంతకన్నా విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు.