‘‘శ్రీరాముని పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం. కొందరి పుట్టుకకు కారణాలుంటాయి. బహుశా ఈ పాత్ర
పోషించడానికే నేను పుట్టానేమో! ‘శ్రీరామరాజ్యం’ ప్రారంభమే కాకతాళీయంగా జరిగింది. సాయిబాబాగారు ఈ కథ గురించి
చెప్పడం, బాపు-రమణ అనగానే నేను ఓకే అనేయడం, సీతగా నయనతార, వాల్మీకిగా అక్కినేని, లక్ష్మణుడిగా శ్రీకాంత్...
ఇలా అందరూ అడిగిందే తడవుగా అంగీకారం తెలపడం.. ఇదంతా ఆలోచిస్తే దైవసంకల్పంలా ఉంది’’ అన్నారు నందమూరి
బాలకృష్ణ. బాపు దర్శకత్వంలో ఆయన శ్రీరాముడిగా నటించిన పౌరాణిక చిత్రరాజం ‘శ్రీరామరాజ్యం’.
యలమంచిలి సాయిబాబు నిర్మాత. ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఇటీవల భద్రాద్రి సీతారాముల
సన్నిధిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే... ఈ చిత్రానికి సంబంధించిన 2జీబీ మెమరీకార్డును బాలకృష్ణ
చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇందులో ‘శ్రీరామరాజ్యం’ గీతాలతో పాటు, ఆ చిత్రానికి సంబంధించిన
ఛాయాచిత్రాలు, వాల్‌పేపర్స్ ఉంటాయి. ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘బాపు కాక మరో దర్శకుడైతే ఈ సినిమా
చేసుండేవాడ్ని కాదు. ఇలాంటి కావ్యాన్ని తీర్చిదిద్దడం ఆయనకు మాత్రమే సాధ్యం.
ముళ్లపూడివారు రాసిన ప్రతి పదం మాలో నిక్షిప్తమై ఉన్న నిజమైన కళను మేల్కొలిపింది. నాన్నగారి ‘లవకుశ’ మళ్లీ
తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇళయరాజా స్వరపరచిన గీతాలు శ్రోతల్ని ఆనందపారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.
బంధాలకు, అనుబంధాలకు, అన్యోన్యతకు, ఆత్మీయతకు, నిజమైన భక్తికి, నిర్మలమైన ప్రేమకు, ధర్మనిరతికి దర్పణం
రామాయణం. దాని ఔన్నత్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం.
కచ్చితంగా అందరి అంచనాలను అందుకుంటాం’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘తొలిసారి పూర్తిస్థాయి పౌరాణికం చేశాను.
అది కూడా బాపు గారి దర్శకత్వంలో బాలకృష్ణగారితో కలిసి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రీకాంత్ చెప్పారు.
ఇంకా చిత్ర గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, యలమంచిలి రేవంత్, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్
గుప్తా, దయానంద్ కూడా పాల్గొన్నారు.