‘‘బాలాగారికి నేను పెద్ద అభిమానిని. అందుకే ఈ వేడుకకు రావాలని విక్రమ్‌కృష్ణ అడగ్గానే కాదనలేకపోయాను. ఏ ఆర్టిస్ట్
అయినా బాలాగారి దర్శకత్వంలో సినిమా చేయకపోతే వారి కెరీర్‌లో ఏదో మిస్ అయినట్లే. నాకోసం మంచి కథ సిద్ధం చేయమని
బాలాగారిని కోరుతున్నాను. విక్రమ్, సూర్య, ఆర్య.. బాలగారి దర్శకత్వంలో చేశారు. ఈ సినిమాలో విశాల్‌కి ఆ అవకాశం
లభించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటేష్.
విశాల్, ఆర్య హీరోలుగా బాల దర్శకత్వంలో జీకే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విక్రమ్‌కృష్ణ నిర్మించిన ‘వాడు వీడు’ ఆడియో
ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్ పై విధంగా స్పందించారు. ఈ చిత్రం విజయం సాధించాలని
మరోఅతిథి అల్లు అర్జున్ అభిలషించారు. ఆడియో సీడీని వెంకటేష్ ఆవిష్కరించి అల్లు అర్జున్‌కి ఇచ్చారు.
ఈ సందర్భంగా బాల మాట్లాడుతూ -‘‘ఇది నా సినిమా కాదు. విశాల్, ఆర్య, యువన్ శంకర్‌రాజాది. ఈ సినిమా ప్రివ్యూని చూసి విశాల్ అమ్మ, నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆర్య నాన్న సినిమా చూసి నవ్వాడు. నాక్కావల్సింది అదే’’
అన్నారు.
విశాల్ మాట్లాడుతూ - ‘‘నటుడిగా నాలో ఆకలిని తీర్చిన చిత్రం ఇది. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా భోజనం పెడితే వారిని
దైవంగా భావిస్తారు. నటుడిగా నా ఆకలిని తీర్చిన బాలాగారిని దేవుడిలా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం
విశాల్ దాదాపు 250 రోజులు మెల్లకన్ను పెట్టాడు. బాలాగారి దర్శకత్వంలో ‘నేను దేవుడ్ని’ చేశాను.
ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని ఆర్య అన్నారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన మధుశాలిని, జననీ అయ్యర్, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి, నిర్మాత విక్రమ్‌కృష్ణ, ‘ఆదిత్య’ దయానంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ ఆడియో ఆదిత్య కంపెనీ ద్వారా విడుదలైంది.