జీవా హీరోగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘వందాన్ వెండ్రాన్’. ఈ చిత్రాన్ని ‘వచ్చాడు
గెలిచాడు’ పేరుతో కెవీ వేణుగోపాల్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో
విడుదల చేశారు. బెల్లంకొండ సురేష్ ఆడియోను ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ పారిశ్రామికవేత్త మురళికి అందించారు.
జీవా మాట్లాడుతూ -‘‘తమిళంలో ‘వందాన్ వెండ్రాన్’గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ కథకు భాషతో ప్రమేయంలేదు.
అందుకే అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. దర్శకుడు కన్నన్ ఇప్పటికే తమిళంలో రెండు విజయాలను
అందుకున్నారు. ఈ సినిమాతో తప్పకుండా తను హ్యాట్రిక్ కొడతాడు.
గోవా, ముంబయ్, కేరళ లాంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న తాప్సీతో నటించడం
ఆనందంగా ఉంది. ‘రంగం’లో విలన్‌గా నటించిన నంద ఇందులో కూడా విలన్‌గా చేశాడు. సినిమాల్లో శత్రువులుగా
నటించిన మేం బయట మంచి మిత్రులం. తమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. తప్పకుండాహిట్ అవుతుందని
ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పాటలు చూసి ఈ సినిమాను డబ్ చేయాలని నిశ్చయించాను.
అనువాద చిత్రాలు మంచి విజయం సాధిస్తున్న నేటి తరుణంలో ఈ సినిమా కూడా తప్పక విజయం సాధిస్తుందని
నమ్మకంతో ఉన్నాం’’ అని సమర్పకుడు కేవీవీ సత్యనారాయణ అన్నారు. ఆర్.కన్నన్, మేడికొండ వెంకట మురళీకృష్ణ,
మధుమిత, వేగ మ్యూజిక్ నరసింహారావు, సాగర్, వేణుగోపాల్, ప్రసన్నకుమార్, మురళీధరన్ తదితరులు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.