'నేను సినిమాల్లోకి రాకముందు నాన్నగారు ఓ మాట చెప్పేవారు. ఈరంగంలోకి వెళ్ళాలంటే యాక్షన్, ఫైట్స్, డాన్స్ మాత్రమే కాదు. ప్రేమ, ఆప్యాయతలు ఉండాలి. అవి గౌతంకు ఉన్నాయి. అందుకే మేమంతా వచ్చాం' అని నటుడు రామ్‌చరణ్ అన్నారు. బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా నటిస్తున్న 'వారెవా' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొన్నారు. ఇంకా రానా, నాగార్జున, నాగచైతన్య, విష్ణు, మనోజ్, అలీ, వేణుమాధవ్, మధుర శ్రీధర్‌రెడ్డి, దిల్‌రాజు, ఎం.ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. మధుర ఆడియో ద్వారా సీడీ విడులైంది. ముఖ్య అతిథి కె.రాఘవేంద్రరావు ఆడియో సిడి విడుదల చేసి నాగార్జునకు అందజేశారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ-'ఇక్కడ ఉన్నవారమంతా సినిమానే నమ్ముకున్నాం. మా కుటుంబంలో ఏ బిడ్డ స్క్రీన్‌పైకి వచ్చినా ఎంత టెన్షన్ పడతామో నాకు తెలుసు. నాగచైతన్యను పరిచయం చేసేటప్పుడు హీరోలందరూ ఫోన్లుచేసి అడిగారు. మా సినిమా మధ్య పోటీ ఉంటుందేగానీ, మా మధ్య కాదు. మా పిల్లలు ఎదగాలని అందరికీ ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ తరఫున పరిశ్రమలో అందరి హీరోల తరఫున గౌతమ్‌ను ఆశీర్వదిస్తున్నాన'నని అన్నారు.
ఎం.ఎస్.నారాయణ మాట్లాడుతూ-'గౌతమ్ నా కొడుకులాంటివాడు. నాకంటే చిన్నవాడైనా బ్రహ్మానందాన్ని అన్నయ్యా అని పిలుస్తాను. కామెడీకే అన్నయ్య లాంటివాడు. తెలుగువారు ఎక్కడ ఉన్నా వినోదాన్ని పంచుతున్న వ్యక్తి అతను. నేనూ, బ్రహ్మానందం ఇద్దరమూ లెక్చరర్స్‌మే. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా'నని అన్నారు.
అలీ మాట్లాడుతూ-'బ్రహ్మానందంగారు నటించిన 'మనీ'లో వారెవా ఏమి ఫేసు'అనే పాట పాపులర్. పరిశ్రమలో 28 మంది కమేడియన్లు ఉన్నా అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నాం. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా'మని తెలిపారు.