ఆడియో
 
 
 
 
'వీరంగం' పాటలు
సుమన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వీరంగం'. జోగిని శ్యామలాదేవి కీలక పాత్ర పోషించారు. శివానీ ఆర్ట్ప్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆడియో సీడీని డా.రామానాయుడు విడుదల చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అందజేశారు. సీడీ లోగోను అచ్చిరెడ్డి ఆవిష్కరించారు.

పాటలు, సినిమా విజయవంతం కావాలని డి.రామానాయుడు అభిలషించారు. "వైవిధ్యమైన చిత్రమిది. నిర్మాత అభిరుచి ఉన్న వ్యక్తి'' అని అచ్చిరెడ్డి అన్నారు.

కవిత మాట్లాడుతూ "తెలంగాణ ప్రాంతంలోని దారుణమైన దురాచారం జోగిని వ్యవస్థ. ఇప్పుడు లేదు. పోయింది. పూర్తిగా నిర్మూలించడానికి మాలాంటి వాళ్ళం పోరాడుతున్నాం. శ్యామలకు అభినందనలు'' అని తెలిపారు.

నిర్మాత శ్రీనివాస యాదవ్ చెబుతూ "వేముగంటి చెప్పిన కథ నచ్చింది. నందన్‌రాజ్ సంగీతం మెప్పిస్తుంది. అందరూ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాం'' అని తెలిపారు.

దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ "సినిమా ఆద్యంతం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. 'వీరంగం'లోని ప్రతి పాత్రా ముఖ్యమైనదే. జోగిని వ్యవస్థపై పోరాడుతున్న శ్యామలను చూసి ఈ కథ రాశాను. 'వీరంగం' చిత్రానికి శ్రీనివాసయాదవ్‌గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం'' అన్నారు.

చాలా కాలం తర్వాత 'నేటి భారతం' లాంటి సినిమా చేశాననే ఫీలింగ్ ఉందని సుమన్ తెలిపారు. "ఈ సినిమాలో నటించడానికి ముందు నేను ఒప్పుకోలేదు. దాదాపు మూడు నెలలు పోరాడి నాతో ఒప్పించారు'' అని శ్యామలాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కిషన్‌రావు, కత్తి పద్మారావు, డి.ఎస్.రావు, బాబూమోహన్, శివపార్వతి, నందన్‌రాజ్, రామ్ పినిశెట్టి, సందీప్తి తదితరులు పాల్గొన్నారు. ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా విడుదలైంది.