అవసరాల శ్రీనివాసరావు, విజయ్సాయి టైటిల్ పాత్రధారులుగా జియో మీడియా ఆర్ట్స్ పతాకంపై హర్షారెడ్డి నిర్మిస్తున్న చిత్రం
'వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్' ఆడియో సీడీలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ చిత్రం ద్వారా సత్య వారణాసి దర్శకునిగా
పరిచయమవుతున్నారు. సోమవారం తమ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి ఈ సినిమా ఆడియో
సీడీల్ని విడుదల చేశారు.
ఆ తర్వాత ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత హర్షారెడ్డి మాట్లాడుతూ "ఈ స్క్రిప్టు మీద ఆరు
నెలలు కూర్చున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. వంద శాతం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సత్య సూపర్ఫాస్ట్ డైరెక్టర్.
ఫెంటాస్టిక్గా తీశాడు'' అని చెప్పారు. దర్శకుడు సత్య మాట్లాడుతూ అందరి సహకారంతో సినిమా బాగా వచ్చిందన్నారు.
రెండు గంటల సేపు ప్రేక్షకుల్ని నవ్వించే ఈ సినిమాలో చక్కని మ్యూజిక్ ఉందని హీరో అవసరాల శ్రీనివాసరావు అన్నారు.
ఎన్నిసార్లు ఈ సినిమా చూసినా అన్నిసార్లూ నవ్వుతూనే ఉన్నానని ఎడిటర్ నికొలస్ చెప్పారు. అతిథులుగా పాల్గొన్న హీరో శివాజీ, దర్శకులు నిధి ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ఈ సినిమాతో దర్శకుడికి మంచి పేరు రావాలనీ, నిర్మాతకి లాభాలు అందాలనీ ఆకాంక్షించారు.
కరీనా షా, జెమిని సురేశ్, ఆర్.కె., ఇంటూరి వాసు, శ్రీలత, భవ్య, లావణ్య తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: కుమార్ దావులూరి, పాటలు: తడ రాజా, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: బాల్రెడ్డి, కళ: నారాయణరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, కూర్పు, దర్శకత్వం: సత్య వారణాసి.