అక్కినేని వంశంలోని మూడుతరాల హీరోలతో ఓ చిత్రం చేయడానికి సిద్ధమని నాగార్జున చెప్పారు. మంచి కథ దొరికితే ముగ్గురితో ఓ చిత్రం చేస్తానని నిర్మాత శివప్రసాదరెడ్డి చెప్పడంపై నాగార్జున స్పందిస్తూ- ‘అటువంటి చిత్రం వస్తే మంచిదే. మాకు కూడా మంచి జ్ఞాపకం అవుతుంది’ అన్నారు. కిరణ్ దర్శకత్వంలో శివప్రసాద రెడ్డి నిర్మించిన ‘కేడి’ విడుదల సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన భావాలను పంచుకున్నారు.
పూర్తిగా భిన్నమైన చిత్రం
‘కేడి’ కొత్త రకం కథనంతో పూర్తిగా భిన్నమైన చిత్రంగా కిరణ్ రూపొందించాడు. ‘యువ’ సీరియల్ కి మాటలు రాసిన కిరణ్ కథ చెప్పే విధానం నచ్చి, అతనికి ఈ అవకాశం ఇచ్చాను. ఈ చిత్రం చూస్తే దర్శకుడిగా అతనికి ఇది తొలిచిత్రం అని అనిపించదు. జనం కోరే కొత్తదనంతో ఈ చిత్రం ఆసక్తికరంగా వుంటుంది. ‘శివ’లో ప్రతిపాత్రకీ ప్రాధాన్యత వుంటుంది. అలానే ఇందులో చాలా చిన్న పాత్రలు వుంటాయి. కానీ అన్నింటికీ ప్రాధాన్యత వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పే విధానం చాలా బాగుంది.
చిన్నప్పటి చేదు అనుభవాల కారణంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా హీరో పెరుగుతాడు. అతని పేరు రమేష్. అంతా అతన్ని రమ్మీ అని పిలుస్తారు. పూర్తి వినోదాత్మకంగా, ఎనర్జిటిక్ గా నా పాత్ర వుంటుంది. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ పాటలతో కలిపి తొమ్మిది మంచి పాటలు ఇచ్చారు. సర్వేష్ మురారి కనుల పండువగా ఫొటోగ్రఫీని అందించారు. రీరికార్డింగ్ కి 25రోజులు, డిజిటల్ ఇంటర్మీడియెట్ కి 20రోజులు తీసుకున్నారు. ఆ విధంగా టెక్నికల్గా చాలా బాగా వచ్చేలా శ్రద్ధ చూపించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా సహజత్వానికి దగ్గరగా వుంటాయి.
కేవలం గ్లామరే కాకుండా ప్రొఫెషనలిజం వున్న నటి మమతా మోహన్ దాస్. అందుకనే ఆమెను ఇందులో నాయికగా తీసుకున్నాం. చిన్నప్పటి నుండీ రమ్మీని పట్టుకోవాలనే ప్రయత్నంలో కష్టనష్టాలు అనుభవించే పాత్రలో సయ్యాజీషిండే చేశారు. పెద్దపాత్ర కాకపోయినా బ్రహ్మానందం కూడా ఇందులో ఓ ‘కేడి’ పాత్ర పోషించారు. ఈ చిత్రం కోసం గోవాలోని క్యాసినోలలో, గ్రీస్ లోని జైలోస్ దీవిలో షూటింగ్ చేశాం.
పైరసీబారినుండి కాపాడాలి
పైరసీ, టీవిల మూలంగా ఇప్పుడు సినిమాలను ఎక్కువ ప్రింట్లతో విడుదల చెయ్యాల్సి వస్తోంది. ఓపెన్సింగ్స్ ద్వారా ఎక్కువగా రాబట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల తమిళంలో ‘జగ్గూభాయ్’ సినిమా పైరసీ విషయంలో పరిశ్రమ అంతా తీవ్రంగా నిరసించడంతో ప్రభుత్వం కొంతవరకూ చర్యలు చేపట్టింది. పెద్దవాళ్ళ ప్రమేయంతో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ పైరసీని అరికట్టడం ప్రభుత్వ సంకల్పం లేకుండా సాధ్యంకాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఆదాయాన్ని ప్రభుత్వానికి, మరెంతో మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్న సినిమా పరిశ్రమని పైరసీ బారినుండి ప్రభుత్వం కాపాడాలి.
కామాక్షి సంస్థను మా సంస్థలానే భావిస్తాం. శివప్రసాదరెడ్డి నాకు మంచి మిత్రుడు. ఈ సంస్థలో మంచి కమర్షియల్ చిత్రాలు చేశాను. అలాగే రకరకాల పాత్రలు చేయడానికి ఈ సంస్థ దోహదపడుతోంది. కామాక్షి రజతోత్సవ సంవత్సరంలో ‘కేడి’ విడుదలకావడం చాలా ఆనందంగా వుంది. శివప్రసాదరెడ్డి కుమారుడు చందన్, మా నాగచైతన్య మంచి మిత్రులు. అజయ్ భూయాన్ దర్శకత్వంలో వారు భారీస్థాయిలో చేస్తున్న చిత్రం 80శాతం విదేశాల్లో జరుగుతుంది.
‘ఏ మాయ చేశావె’ పాటలు చాలా బాగున్నాయి. సాహిత్యం వినిపించకుండా ఈమధ్య సంగీతం డామినేట్ చేస్తూ పాటలు వస్తున్నాయి. అయితే ఇందులో రెహమాన్ సాహిత్యం స్పష్టంగా వినిపించేలా హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇవి స్లో పాయిజన్ లా పెద్ద హిట్ అవుతాయి.
మా మేకప్ మెన్ చంద్ర నిర్మాత కావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ‘పంచాక్షరి’లో చిన్న పాత్ర చేయమంటావా? అంటే, వద్దు... భవిష్యత్తులో ఫుల్ పాత్రనే చేయమని అడిగాడు. అలాగేనని అన్నాను.
నాన్న ఓ చిత్రం అంగీకరించారని తెలిసి సంతోషించాను. ఎందుకంటే- ఆయన నటనకు అలవాటు పడ్డారు. ఖాళీగా ఉండటం ఇబ్బందికరంగా వుంటుంది. షూటింగ్ లో వుంటే హ్యాపీగా వుంటారు.