ఒక నవలిస్టు, జర్నలిస్టు అయిన అల్లాణి శ్రీధర్ దర్శకునిగా మారి ఒక తపనతో రూపొందించిన చిత్రం ‘కొమరం భీమ్’.
ఒక యజ్ణంలా భావించి ఆదిలాబాద్ అడవులలో గోండుజాతి గిరిజనుల మధ్య చెట్టుల్లో పుట్టల్లో పురుగు పుట్రల మధ్య,
చుట్టూ సంచరించే క్రూర మృగాల మధ్య ఏమాత్రం కనీస సౌకర్యాలు లేని అప్పటి రోజుల్లో సుమారు 40రోజులపాటు ఎంతో
శ్రమపడి ‘కొమరం భీమ్’ అనే గిరిజన గోండుజాతి చారిత్రక పురుషుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అల్లాణి శ్రీధర్.
తన మొదటి చిత్రాన్నే అంతకష్టపడి చేసిన శ్రీధర్ సామాన్యుడు కాదు. బ్రహ్మాండమైన సాహిత్య సంపద కలిగినవాడు.
అభ్యుదయ భావాలను జీర్ణించుకున్నవాడూను. ముఖ్యంగా సినిమానే జీవితంగా భావించినవాడు. తను చిత్రరంగంలోకి
ప్రవేశించిన పాతికేళ్లలో చలనచిత్ర దర్శకునిగా ఏనాడూ ఖాళీగా లేరు. విరామం లేకుండా ఎప్పుడూ ఏదో చిత్రం చేస్తూనే
వున్నారు. ఇది శ్రీధర్ పట్ల నిర్మాతల నమ్మకానికి, నిజాయితీకి తార్కాణం.
శ్రీధర్ సినీ కార్మికుడు. ఎప్పుడూ శ్రమిస్తూనే వుంటాడు. ఆ శ్రమలో నిజాయితీ వుంటుంది. ఇంకా చెప్పాలంటే శ్రీధర్ వంటి
రాజకీయ అవగాహన, సాహిత్య పరిపుష్టత, సినిమా పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగిన యువకులు మనకీనాడు
కనిపించరు. ఒక మంచి దర్శకునికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగిన ప్రతిభావంతమైన దర్శకుడు అల్లాణి. ఒక అల్లూరి
సీతారామరాజు, ఒక భగత్ సింగ్ వంటి కొమరం భీమ్ జీవితాన్ని తన మొదటి చిత్రంగా ఎంచుకున్నారంటే సినిమా పట్ల,
చరిత్ర పట్ల ఆయనకెంత ప్రేమ వుందో మనకర్థమవుతుంది. ఒక చరిత్ర పురుషుడ్ని తెరకెక్కించడం కత్తిమీద సాములాంటిది.
ఆ చరిత్ర కోసం ఎంతో శ్రమించాలి. అలాంటి చిత్రాలు రూపొందించే దర్శకునికి ముఖ్యంగా కావాల్సింది సిన్సియారిటీ, తీస్తున్న
విషయం పట్ల అవగాహన. వాటిని పూర్తిగా కలిగించుకున్న తర్వాతనే దర్శకత్వానికి దిగటం జరిగింది. అల్లాణి తాను
తీస్తున్న సబ్జెక్ట్ పై ఒక ఇష్టాన్ని, ప్రేమను కలిగించుకున్న అనంతరమే కొమరం భీమ్ చిత్రాన్ని చేయడం జరిగింది. తన
మొదటి చిత్రం కొమరం భీమ్ తోనే ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా రెండు నంది అవార్డులను
అందుకోవడం అల్లాణి ప్రతిభకు తార్కాణం. కొమరం భీమ్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే నెల రెండో వారంలో
విడుదలవుతున్న సందర్భంలో దర్శకుడు అల్లాణి శ్రీధర్ తో జరిపిన ఇంటర్వ్యూ.....
మొదటి చిత్రంగా ‘కొమరమ్ భీమ్’నే ఎందుకు ఎంచుకున్నారు?
అప్పుడు ఆర్ట్ సినిమాలకు, ఉద్యమ సినిమాలకు మంచి ఊపు, ఆదరణ వుండేది. అలాంటి సమయంలో దర్శకునిగా
మారాలనుకుని ముందుగా గిరిజన సంస్కృతి, గిరిజన ఉద్యమాలపై ఒక డాక్యుమెంటరీ తీద్దామనుకున్నాను. అప్పుడు
రచయిత ప్రాణ్ రావు గారితో కలిసి కొమరం భీమ్ ను రీసెర్చ్ చేయడం జరిగింది. ఎంతో విషయ సేకరణ జరిగాక
డాక్యుమెంటరీగా కంటే సినిమాగా తీస్తేనే కొమరమ్ భీమ్ చరిత్రకు నా్యయం జరుగుతుందని భావించాం. అదే సమయంలో
రచయిత, నటుడు భూపాల్ రెడ్డి వచ్చారు. అందరం కలిసి ఐటిడి సిఇవోగా వున్న పి.సుబ్రహ్మణ్యం గారిని కలిసి మా ప్రాజెక్ట్
విషయం చెప్పాం. ఆయన వెంటనే ఓకె చేశారు. ఆయన చాలా గొప్ప మనిషి. స్క్రీన్ ప్లే ను ప్రాణ్ రావు రాయగా, పాటల్ని
భూపాల్ రెడ్డి రాశారు. పాటలకు అక్కడి గిరిజన ప్రాంతపు ట్యూన్స్ నే తీసుకున్నాం. ‘కొమరం భీమ్’ గురించి రీసెర్చి
మొదలుపెట్టాక నాలో ఒక ఉత్సాహం, ఒక శక్తి వచ్చాయి. ఎలాగైనాసరే భీమ్ చరిత్రను సజీవం చేయాలనిపించింది. మన్య
ప్రాంతపు వీరుడు అల్లూరిలా, భీంగోండు గిరిజన జాతి వీరుడు. గోండుల హక్కుల కోసం పోరాడి పోరాడి తన వాళ్లే తీసిన
దొంగదెబ్బకు అసువులు బాసాడు.
‘కొమరం భీమ్’ చిత్ర నిర్మాణపు విశేషాలు తెలపండి?
ఈ చిత్రం అనుకున్నప్పట్నుంచి ఆర్నెల్ల పాటు ఆదిలాబాద్ జిల్లాలోనే గడిపాం. ఎక్కడైతే భీమ్ చరిత్ర జరిగిందో... ముగిసిందో
అక్కడే ఈ చిత్రం షూటింగ్ చేశాం. చరిత్రను చరిత్రగా తెరకెక్కించాం. ఎక్కడా కాల్పనికత ఉండదు. సజీవత ఉట్టిపడుతుంది.
చిత్ర నిర్మాణంలో అక్కడి ట్రైబల్స్ గైడెన్స్ ను కూడా తీసుకున్నాం. ఈ చిత్రంలో ప్రాణ్ రావు, భూపాల్ రెడ్డి తప్ప మిగిలిన
వాళ్ళంతా కొత్తవాళ్ళే. పనిచేశారు. దాంతో అందరం ఎనర్జిటిక్ గా పనిచేశాం. ఉత్తం దర్శకునిగా నాకు, ఉత్తమ జాతీయ
సమైక్యతా చిత్రంగా సినిమాకు నంది అవార్డులు వచ్చినా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొని ప్రశంసలందుకున్నా....
విడుదల ఆగిపోయింది. సినిమా నిర్మాణ పోరాటం కంటే విడుదలకు అంతకు పదిరెట్లు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ
సినిమాను కొన్ని ప్రత్యేక సందర్భాలలో విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్, ఉట్నూరు మొదలైన చోట్ల ప్రదర్శించగా
మంచి స్పందన వచ్చింది. భూపాల్ రెడ్డి, నేను కలిసి ఈ సినిమా విడుదల కోసం ఎక్కని ఆఫీసు గుమ్మం లేదు. కలవని
ఆఫీసరు లేడు.
ఇప్పుడు రిలీజ్ కు సహకరించిన వారెవరు?
ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు గిరిజన సంక్షేమశాఖామంత్రి బాలరాజుగారు, ట్రైబల్ కమిషనర్ శాంతకుమారి గారు, ఎఫ్.డి.సి. ఎండి
పార్థసారథి గారు మరియు కొమరం భీమ్ ఫౌండేషన్ సహకారంతోను రిలీజ్ అవుతోంది.
చిత్రంలోని ప్రధాన అంశం ఏమిటి?
గోండు చరిత్రలో గిరి సమానుడైన నేత కొమరం. అడవి బిడ్డల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి శత్రువు దొంగదెబ్బ
తీయడంతో ప్రాణాలర్పించిన అసమాన యోధుడు భీమ్. కొమరమ్ భీమ్ జీవితాన్ని చలనచిత్రంగా రూపొందించడం ద్వారా
గోండు జాతి చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించాలన్నది మా ఉద్దేశ్యం. ఇన్నాళ్ళు సినిమా రిలీజ్ కాలేదన్న బాధే
తప్ప అవార్డులు వచ్చాయన్న ఆనందం లేదు. కొమరమ్ భీమ్ లా మేము కూడా ఈ చిత్రం కోసం మూడు పోరాటాలు
జరిపాం. మొదటి పోరాటం ‘కొమరం భీమ్’ చరిత్రను సేకరించడం, రెండవది.... అడవులలో చిత్ర నిర్మాణం. మూడవది... రిలీజ్
కు సుమారు 15ఏళ్ళ పోరాటం.
ఎంతో ప్రతిభ వున్న మీరు పక్క కమర్షియల్ చిత్రాల వైపుకు ఎందుకు వెళ్ళలేదు?
ఎందుకు వెళ్ళలేదంటే ‘కొమరం భీమ్’ తర్వాత వచ్చిన అవకాశాలు అటువంటివి. అయితే నేను ‘కొమరం భీమ్’, ‘గౌతమ
బుద్ధ’, ‘రగులుతున్న భారతం’ వంటి చిత్రాల ద్వారానే దర్శకునిగా ఆనందం పొందుతాను. వృత్తిపరంగా, దర్శకునిగా
సమాజాన్ని చెడగొట్టని చిత్రాల్నే చేశాను. అదొక ఆనందం నాకు. అలాగే సాయి చరణం, ఆదిపరాశక్తి, కవిపరంపర, మనకథ
వంటి సూపర్ హిట్ సీరియల్స్ చేశాను. ప్రస్తుతం యాడ్ ఫిలింస్ చేస్తున్నాను. నచ్చిన పని దొరకనప్పుడు వచ్చినపనల్లా
చేస్తూ వచ్చాను. అందుకే ఎప్పుడూ ఖాళీలేకుండా నిరంతరం వర్క్ చేస్తూనే వున్నాను.
ఇప్పుడు ‘కొమరం భీమ్’కు ఎలాంటి స్పందన లభిస్తోంది?
సినిమా తీసిన ఇన్నేళ్ళకు డిస్ట్రిబ్యూటర్స్ నుండి, ప్రజల నుండి ఎంతో సానుకూల స్పందన వచ్చింది. ఇది మేము
ఊహించని పరిణామం. ప్రజల్లో భీమ్ చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉప్పెనలా వచ్చింది. మామూలుగానే ఇటీవల
చారిత్రకచిత్రాల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. ‘కొమరమ్ భీమ్’ పాత్రకు భూపాల్ రెడ్డి అద్భుతంగా సరిపోయాడు. ఆయనకు ఈ
చిత్రం ద్వారా మంచి పేరొస్తుంది.