తొలి ఐదేళ్ళూ పాట కోసమే ప్రయాణం. ఎవరు పాట ఇస్తారో... అని ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. ఎవరైనా కనికరించి ఇస్తే... దాన్నే మహాప్రసాదంగా స్వీకరించేవాణ్ని. ఒకే ట్యూన్ నలుగురైదు రచయితలకు ఇస్తారని నాకు తెలీదప్పుడు. తీరా కష్టపడి రాస్తే క్యాసెట్లో నా పేరు, పాట రెండూ వుండేవి కాదు. అలా ఎన్నోసార్లు ఓడిపోయాను. ‘ఇట్లు... శ్రావణి సుబ్రహ్మణ్యం’లోని రామసక్కని బంగారు బొమ్మ... రాసలీలకు వస్తావా... పాటతో నా ప్రయాణంలో వేగం మొదలైంది అని అంటున్నారు పాత్రికేయుడిగా ప్రారంభించి, పాటల రచయితగా మారి పదేళ్ళలో 300 పాటలు రాసిన భాస్కరభట్ల రవికుమార్.
పాటల రచయితగా పదేళ్ళు కొనసాగడం అంటే సుదీర్ఘ ప్రస్థానమే. ఇంతకాలం ఈ పోటీలో ఎలా నిలబడ్డారు?
నేను చేసేది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? దర్శకుడికి పేరుందా? లేదా? అని ఎప్పుడూ ఆలోచించలేదు.పావలాకూ పాట రాశా. పాతిక వేలకూ రాశా. నన్ను నమ్మి పాటని అప్పగించిన దర్శకులకూ, స్వరకర్తలకూ రుణపడి వుంటాను. అలాగే నా అర్థాంగి లలిత. పాట కోసం పరితపిస్తున్నప్పుడు నా భావాన్ని, పాట వెనకాలే పరుగెడుతున్నప్పుడు నా బాధనీ అర్థం చేసుకొంది.
ఇంతకీ ఏం సాధించారు?
నేను రాసినవి మూడొందల పాటలు. నా బీరువా తెరిస్తే అందులో నేను పాట రాసిన ప్రతి సినిమాకి చెందిన క్యాసెట్ భద్రంగా వుంటుంది. ఇంట్లో మా ఆవిడ గాజులు దాచుకోవాలన్నా చోటుండదు. అన్నిచోట్లా పాటల క్యాసెట్లే. నా పాటే నా ఆస్తి. ‘భాస్కరభట్ల మాస్ పాటలు బాగా రాస్తాడ్రా...’ అని అంటుంటారు. అది నేను దక్కించుకున్న గౌరవం. అప్పుడప్పుడూ సార్ ఫలానా సినిమాలో పాట రాశారు కదా... అలాంటి పాటే మాక్కూడా రాసి పెట్టండి అని అడుగుతారు. అలాంటప్పుడు మాత్రం నా పాట నన్నే శాసిస్తుందేంటి? అనిపిస్తుంది.
ఐటమ్ పాటల నిపుణుడు... అనే ముద్ర చెరిపివేసుకోవాలని లేదా?
అన్నీ తెలిసుండాలి... ఒక దాంట్లో నైపుణ్యం వుండాలి. ఏ రంగంలోనైనా రాణించడానికి కావాల్సిన ముఖ్య సూత్రమిదే. ఐటమ్ పాటల స్పెషలిస్ట్ అన్నారంటే దాన్ని ఓ గౌరవంగానే స్వీకరిస్తా. అతి తక్కువ కాలంలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందంటే ఆ పాటల వల్లే. ‘పోకిరి’లో ‘ఇప్పటికింకా నా వయసు...’- పాట భలే రాశారండీ అంటుంటే ఇప్పటికీ నాలోని మాస్ రచయిత మనసులోనే విజిల్ వేస్తాడు. ‘బొమ్మని గీస్తే నీలా వుంది’ అని ‘బొమ్మరిల్లు’ కోసం రాసినప్పుడు, ‘నీ కళ్లతోటి’ అంటూ ‘తులసి’లో రాసుకున్నప్పుడు నాలోని క్లాస్ రచయిత చాలా సంతృప్తి చెందాడు.
ఈ పదేళ్ళలో సినిమా పాట మీద మీకున్న అభిప్రాయంలో మార్పులొచ్చాయా?
రాజమండ్రి గోదారి గట్టు మీద కూర్చుని రాసుకున్న పాటలు చూసుకుని ‘ఓస్.... పాట రాయడం ఇంత ఈజీనా?’ అనుకునేవాణ్ని. అదెంత కష్టమో పదాల గోదారిలో దిగాకగానీ తెలీలేదు. ఓ భావం కోసం కవి ఎంతగా తాపత్రయపడతాడో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. రచయితల మీద గౌరవం పెరిగింది.
చిన్నిచిన్ని పదాలతోనే గమ్మత్తులు సృష్టిస్తారు. దాని వెనుక చేసే కసరత్తులేంటి?
ఇక్కడ కొత్త ఎక్స్ ప్రెషన్ ఇవ్వకపోతే కవి ఎక్స్ ఫైర్డ్ అయిపోయినట్టే. సిరివెన్నెల, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్... ఇలా ఎవరూ ఎవరికీ తీసిపోరు. అందుకే ఎప్పుడూ నిరూపించుకోవాల్సిందే. ఒక పాట పట్టుకుని పదేళ్ళు గడిపేద్దాం అనుకుంటే కుదర్దు. అందుకే పదసృష్టి కోసం తంటాలుపడతాం. దాని వెనుక కసరత్తు ఎలావున్నా... ఫలితాలు వచ్చినప్పుడు వచ్చిన ఆనందంలో అవన్నీ కొట్టుకుపోతాయి. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ‘పెళ్ళెందుకే రమణమ్మా’ అనే పాట రాశా. దానికి వచ్చిన స్పందన అపూర్వం అనిపించింది. ఈ మధ్య ‘నా కులుకే ఎనస్తీషియా, నా వెనుకే సమస్తాసియా‘ అని రాశా. ఈ సౌండింగ్ మణిశర్మకు బాగా నచ్చింది.
కేవలం సౌండింగ్ కోసం లేని పదాలు కొన్ని పుట్టించేస్తారా?
అప్పుడప్పుడూ తప్పవు. ‘వాబీ సాబీ’ అనేది జపాన్ సౌందర్య శాస్త్రం. ఆ పేరు వాడుకోవాలనిపించింది. అందుకే ఓ చోట ‘వాబీ సాబీ నా హనీబీ నీదే ఈ బేబీ; చాబీ ఇస్తా ఓ షరాబీ, చూస్తవా నాభీ’ అంటూ ఓ వింత ప్రయోగం చేశా. ఇక్కడ వాబీ సాబీ అంటే అర్థం తెలియకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఆత్మ సంతృప్తినిచ్చిన పాటలేంటి?
‘నేనింతే’లో ‘కృష్ణానగరే... మామ...’ అనే పాట రాశా. చాలామందిని కదిలించిన పాటది. కృష్ణా నగర్ లో నేను ఎప్పుడు కనిపించినా ‘మా గురించి చాలా బాగా రాశారు సార్. విన్నాక చాలా ధైర్యం వచ్చింది. అందుకే తిరిగి మా ఊరు వెళ్ళిపోదాం...
అనుకున్నవాణ్ని ఇంకా ప్రయత్నిస్తూనే వున్నా’ అంటుంటే చాలా సంతోషంగా వుంటుంది.
మీకు సవాల్ గా నిలిచిన సందర్భం ఈ మూడొందల పాటల్లో దేనికొచ్చింది?
‘గోలీమార్’లో మగాళ్ళని తిడుతూ ఓ పాట రాయమన్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే...’ అన్నాం గానీ, మగాళ్ళ గురించి మనం ఎప్పుడూ వినలేదు. దాంతో నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ‘మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు...’ అని అందుకున్నాను. అది నిజానికి తిట్లుకావు. ఆ పాటలో వాళ్ళ బాధ్యతని గుర్తు చేశానంతే. అందుకే అందరికీ చాలా బాగా నచ్చింది.