సినిమాకు సంబంధించిన 24 సృజనాత్మక కళల్లో నటీనటుల పాత్ర ప్రధానమైనది. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, ప్రాణప్రతిష్ట చేసిన విలక్షణ నటులు
మనకెందరో వున్నారు. ఉదాహరణకు నందమూరి తారక రామారావు చేసిన కృష్ణుడు, రాముడు మొదలైన పౌరాణిక పాత్రలను, అక్కినేని
నాగేశ్వరరావు చేసిన దేవదాసు, యస్.వి.రంగారావు అద్భుతంగా ఆవిష్కరించిన ఘటోత్కచుని పాత్రలను చెప్పుకోవచ్చు. ఈ రోజుకీ ఆ పాత్రలు
సజీవంగా వున్నాయంటే అది ఆయా నటుల ప్రతిభకు తార్కాణం. సినిమా దృక్పథం కళ నుండి వ్యాపారానికి మారిపోయిన ఈ రోజుల్లో కూడా
ఇలాంటి అరుదైన పాత్రల రూపకల్పన, ఆ పాత్రలను సజీవంగా పోషించగలిగే నటుల ప్రతిభ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇదే కోవలోకి
చేర్చదగిన పాత్ర ‘కొమరం భీమ్’ - ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసారు విలక్షణ నటుడు భూపాల్ రెడ్డి.
గిరిజనుల హక్కుల కోసం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి, తన జాతి విముక్తి కోసం అసువులు బాసిన అమర యోధుడిగాథ - ఈ
‘కొమరం భీమ్’ చిత్రం. జూన్ 3వ వారంలో విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర కథానాయకుడు ‘భూపాల్’తో ప్రత్యేక ఇంటర్వ్యూ.....
- భూపాల్ గారూ... నటుడిగా సినిమాల్లో ప్రవేశానికి ముందు మీ నేపథ్యం గురించి చెప్తారా?
చిన్నతనం నుంచే నాకు నటన పట్ల ఆసక్తి వుండేది. స్కూల్లో, కాలేజీలో నాటకాలు వేసిన అనుభవం వుంది. విద్యార్థి సంఘాలతో సాంస్కృతిక
విభాగాల్లో పనిచేసినప్పుడు పాటలు రాయడం, పాడడం, నాటకాలు వేయడంలాంటివి విస్తృతంగా జరిగేవి.
- నటుడిగా సినిమారంగ ప్రవేశం ఎలా జరిగింది?
ప్రముఖ దర్శకులు బి.నరసింగరావు నా మిత్రుడు. నరసింగరావు ‘మాభూమి’ సినిమా తీస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ ఘోష్ నా స్టేజి
ప్రదర్శన ఒకటి చూడ్డం జరిగింది. అందులో నా పెర్ఫార్మెన్స్ను అభినందించి, నాకు ‘మాభూమి’ చిత్రంలో ఒక ప్రముఖ పాత్ర ఇవ్వడం జరిగింది.
- కొమరం భీమ్ చిత్రంలో మీ నటనకు, పాత్రలో ఒదిగిన తీరుకు సినీ విశ్లేషకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పాత్ర పోషణలో
మీరు తీసుకున్న జాగ్రత్తలు, అవలంభించిన పద్ధతులు ఏమిటి?
ఏ పాత్ర చేసినా ముందుగా ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడం, పాత్ర స్వభావం, స్వధర్మాలను ఆకళింపు చేసుకుని చాలా విషయాలు ప్రాక్టీస్
చెయ్యడం- నేనెంచుకున్న మార్గం. ఉదాహరణకు కొమరం భీమ్ పాత్ర గురించి, ఆయన నివసించిన ప్రాంతానికి వెళ్ళి విషయాలను సేకరించడం
జరిగింది. గోండుల వేష, భాషలను, ఆచార వ్యవహారాలను, శరీరభాషను చాలా సునిశితంగా పరిశీలించి వాటిని ఆ పాత్రకు ఆపాదించి
నటించినందువల్లే ఆ పాత్ర పోషణ ప్రశంసలు అందుకుంది.
- ఆర్ట్ సినిమాలకు, అవార్డు సినిమాలకే ఎందుకు పరిమితమయ్యారు. కమర్షియల్ సినిమాల్లో ఎందుకు నటించడంలేదు?
ఇందుకు ప్రధాన కారణం నా నేపథ్యం. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలతో పెనవేసుకున్న నా జీవితం, సహజత్వానికి దగ్గరగా వుండే సినిమాల పట్ల
ఇష్టాన్ని పెంచింది. తర్వాత కాలంలో ఒకటి రెండు కమర్షియల్ సినిమాలు ప్రయత్నించినప్పటికీ, ఆ వాతావరణంలో ఇమడలేక విరమించుకోవడం
జరిగింది.
- సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమైన ‘కొమరం భీమ్’ ఇప్పుడు విడుదల అవుతున్నందుకు మీ స్పందన?
చాలా సంతోషంగా వుంది. సినిమా చరిత్రలో ఏ సినిమాకి లేని విశిష్టత మా సినిమాది. 20 సంవత్సరాల తర్వాత రిలీజైన సినిమా చరిత్రలోనే లేదు. ఈ
సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ నిస్వార్థంగా, అంకిత భావంతో, ఉద్యమ స్ఫూర్తితో చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఈ విషయాన్ని
గుర్తిస్తాడు. ఇది కాలుష్యం లేని, స్వచ్ఛతతో కూడిన సహజమైన సినిమా.
- ఇంతకాలం క్రితం తీసిన సినిమా ప్రేక్షకులకు పాతగా అనిపించే ఆస్కారం లేదా?
వయస్సు మాకు పెరిగిందే తప్ప, సినిమాకి కాదు. ఇది మామూలు సమకాలీన సామాజిక చిత్రం కాదు. ఒక గోండు వీరుని జీవిత చరిత్ర. చరిత్ర
ఎప్పుడూ పాతబడదు. తరతరాలు అదే చరిత్రను చదువుతారు.
- ఈ సినిమాలో మీకు నచ్చిన ప్రధాన అంశం?
సుమారు 75 సంవత్సరాల క్రితం నెలకొన్న గోండుల జీవనశైలిని యదాతథంగా దృశ్యబంధం చేయడం. సంస్కృతులు, జాతులు అంతరించిపోతున్న
ప్రస్తుత నేపథ్యంలో ఈ సినిమాలోని గిరిజన వేషభాషలు, ఆచార వ్యవహారాలు, ఒక రికార్డెడ్ డాక్యుమెంట్ గా ముందు తరాలకు, పరిశోధకులకు ఎంతో
ఉపయోగపడ్తాయి.
- ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దొరుకుతుందని, విజయం సాధిస్తుందని భావిస్తున్నారా?
తప్పకుండా. ఇరవై ఏళ్ళ తర్వాత రిలీజయ్యే సత్తా కలిగిన సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం వుంది. ఇన్నాళ్ళ తర్వాత
జనబాహుళ్యంలోకి ఈ సినిమాను తీసుకెళ్ళగలగడమే మేం సాధించిన అఖండ విజయం.
- మీకు నచ్చిన నటులు?
సహజత్వానికి దగ్గరగా నటించే ప్రతివాళ్ళూ ఇష్టమే. హాలీవుడ్ నటుడు డస్టిన్ హాఫ్ మాన్, మహానటి సావిత్రి, విలక్షణ నటుడు ఎస్.వి.రంగారావు
గార్లు నన్ను బాగా ప్రభావితం చేసినవారు.
- మీరు బాగా ఇష్టపడి చేయాలనుకునే పాత్ర?
మహాకవి గురజాడ.