స్పందన
 
 
 
 
 
నచ్చితే ఏదయినా చేస్తా
జగపతిబాబు

నాకు బర్త్ డే ల కన్నా రీ బర్త్ లే ఎక్కువ. జగపతి బాబు పని అయిపోయింది- అని అనుకున్నప్పుడల్లా నాకు మళ్లీ సక్సెస్ లు వచ్చాయి.... అంటూ 'జై బోలో తెలంగాణా' సక్సెస్ సందర్భంలో ఫిబ్రవరి 12 న పుట్టిన రోజు జరుపుకుంటున్న జగపతిబాబు తో కాసేపు ......

సినిమా రంగంలో ఇది నా 22 వ పుట్టిన రోజు . ఈ ఏడాది ఇంకా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది .కనీసం 10 సినిమాలు చేస్తాను . వంద సినిమాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరం లో ప్రత్యేకత . నేనెప్పుడు కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళ లేదు . ఇప్పుడూ అంతే.

'గాయం -2' పెద్ద హిట్ అవుతుందని ఆశించాము. ఆ సినిమా బాగా వసూలు చేసినా బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల ఫెయిల్ అయ్యాము. అందుకనే మరీ ఎక్కువగా ఆలోచించడం మానేసి ....నిర్మాత, దర్శకులను నమ్ముతూ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. బడ్జెట్ ని కంట్రోల్ చేసుకుని సినిమాలు చేయడమే ఇప్పుడు అవసరం. దానివల్ల అందరికి లాభం. ఇప్పుడు సినిమా బాగుంటేనే సరిపోదు. చాలా సమస్యలున్నాయి . అందుకనేనా 100 వ సినిమా తప్ప, ఇకఫై 60 రోజుల సినిమాలు చెయ్యను.

నేను డాన్సులు చేస్తే బాగోదు. డాన్సులు బాగా చెయ్య లేనప్పుడు ఎక్సర్ సైజులు చేసి ఉపయోగం ఏంటి. దానికోసం ఫారిన్ లోనో, పెద్ద సెట్స్ లోనో 6 పాటలు పెట్టడం దండగ. సందర్భోచితంగా పాటలుంటే ఓకే. ఫైట్స్ విషయం లోను వృధాను అరికట్టాలి . ఎలాగూ సినిమా బాగుంటే ఆడుతుంది లేకపోతే లేదు .

నాకు నచ్చింది ఏ పాత్రయినా చేస్తాను . చిన్నా పెద్ద అనే తేడా లేదు . యాంటి హీరోగా చేయడానికి కూడా నేను సిద్దం . ' లక్ష్యం' వంటి మల్టీ స్టారేర్ సినిమాలలో చేయడానికి కూడా ఓకే . చెప్పుకోడానికి ఓ అడ్రస్ ఉన్న సినిమాలు చేస్తాను .ఏ సినిమా హిట్ ...ఏ సినిమా ఫ్లాప్ ఎవరికి తెలియనప్పుడు ఎవరైనా మంచి పాత్ర చెయ్యమంటే చేస్తున్నాను .'ఆకాశమంత', ' కీ ' సినిమాలు అలాచేసినవే. సినిమాలకి రూల్స్ లేవు. వాటిని నేను పాటించను. టీవీ లోను ఓ ప్రోగ్రాం చేస్తున్నాను.

'చట్టం' పెద్ద బడ్జెట్ సినిమా అయినా బడ్జెట్ ని కంట్రోల్ చేసి బాగా తీసారు. అందుకు నట్టికుమార్ ని అభి నందించాలి. ఈ తరహాలో సినిమాలు చేస్తే అందరూ సంతోషం గా ఉంటారు. కసబ్ ని చంపడం అనే పాయింట్ తో ఈ చిత్రం చేస్తున్నారు. నేను పోలీసు అధికారిగా నటిస్తున్నాను.

'జై బోలో తెలంగాణా' చెయ్యమని వారు అడిగినప్పుడు ఒక రోజు ఆలోచించాను .ఆంధ్రా వారు మంచి వారు . అర్ధం చేసుకుంటారని అంగీకరించాను . మొదట కొందరు భయ పెట్టారు . అయితే ఇప్పుడు అంతా అభి నందిస్తున్నారు. ఓ కళాకారుడిగా ఇందులో చేసాను . అయితే, ఈ సినిమాలో ఆంధ్రావాళ్ళని విమర్శించే మాటలు చెప్పడానికి నేను తిరస్కరించాను. ఆంధ్రా లో మొదట విమర్శలు వచ్చినా... సినిమా చూసిన తర్వాత అర్ధం చేసుకున్నారు.

ఈ ఏడాది నాకు కొత్త మార్కెట్ మొదలయ్యింది అనిపిస్తోంది . ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు అంత వైవిధ్యం గా ఉన్నాయి .' చట్టం' , 'క్షేత్రం' , 'కీ' , 'నగరం నిద్ర పోతున్న వేళ 'ఇప్పుడు జరుగుతున్నాయి .

- రాజేష్