స్పందన
 
 
 
 
 
అమీర్ ఖాన్ భార్యా 'కిరణం'

ఢిల్లీ బెల్లీ....తాజాగా వివాదాల్లో చిక్కుకున్న చిత్రమిది. ఒక దశలో నేపాల్‌లో ఈ చిత్రాన్ని నిషేధించారు. ఆ తరువాత పెద్దలకు మాత్రమే అనుమతించారు. తాజాగా భారతదేశంలోనూ ఇదెన్నో వివాదాల్లో చిక్కుకుంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఈ చిత్రం పై కేసు నడుస్తోంది. ఈ చిత్రానికి అభినయ్‌ దేవ్‌ దర్శకత్వం వహించారు. అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావ్‌ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తీసేందుకు ముందు అభినయ్‌ అమీర్‌ఖాన్‌ను కలుసుకొని కథ వినాల్సిందిగా కోరగా, అందుకు అమీర్‌ఖాన్‌ విముఖత వ్యక్తం చేశారు. చివరకు అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావు ఈ చిత్రానికి జై కొట్టడంతో అమీర్‌ఖాన్‌ సైతం సై అనక తప్పలేదు. ఈ చిత్రానికి తెర వెనుక కథ నడిపించిన కిరణ్‌ నిజ, వెండితెర జీవితంపై ప్రత్యేక కథనం...

సినిమా హీరోల భార్యలు కూడా వారితో సమానంగా పేరుప్రఖ్యాతులు పొందడం అరుదే. అలాంటి అరుదైన ఘనతను పొందిన ఖ్యాతి అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌రావుకు దక్కింది. సమకాలీన బాలీవుడ్‌ వెండితెరపై ఆమె తనదైన ముద్రను వేయగలిగింది. సినిమా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, స్క్రీన్‌రైటర్‌గా పేరు తెచ్చుకుంది.మహారాష్ట్ర లోని కొంకణి ప్రాంతంలో పుట్టిన కిరణ్‌ పెరిగింది అంతా కూడా కోల్‌కతాలో. అక్కడి లోరెటో హౌజ్‌ కాలేజీలో, లా మార్టినైన్‌ లలో విద్యాభ్యాసం సాగింది. 1992లో ఆమె కుటుంబం ముంబయి చేరింది. అక్కడి సోఫియా కాలేజ్‌లో కిరణ్‌ చేరింది. ఎకనామిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌గా 1995లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. రెండు నెలల పాటు సోఫియా పాలిటెక్నిక్‌లో సోషల్‌ కమ్యూనికేషన్స్‌ మీడియా కోర్సు చేశారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడి జామియా మిలియా ఇస్లామియాలోని ఏజేకే మాస్‌ కమ్యూనికేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి మాస్టర్‌ డిగ్రీ పొందారు.

లగాన్‌తో కెరీర్‌ ప్రారంభం
చరిత్ర సృష్టించిన లగాన్‌ సినిమాతో కిరణ్‌రావు తన కెరీర్‌ ప్రారంభించారు. ఆ సినిమాకు ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. లగాన్‌కు దర్శకత్వం వహించిన అశుతోష్‌ గోవర్కర్‌తో కలసి స్వదేశ్‌: వి ది పీపుల్‌ అనే సినిమాకు కూడా పని చేశారు. లగాన్‌74వ అకాడమీ అవార్డ్స్‌కు ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. ఆ చిత్రానికి అమీర్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా అందులో నటించారు. అది హిట్‌ కావడంతో కిరణ్‌ రావ్‌కు కూడా మంచి పేరు వచ్చింది. అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయిన మాన్‌సూన్‌ వెడ్డింగ్‌కు ఆమె సెకండ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అమీర్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరించిన దోభీఘాట్‌ సినిమాకు కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి ఆమెనే స్క్రిప్ట్‌ సమకూర్చారు. అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ కిరణ్‌ పెద్దగా నిరాశపడలేదు. కోల్‌కతా ప్రధానంశంగా రూపొందించే తదుపరి చిత్రానికి ఆమె పని చేస్తున్నారు.

పెళ్ళిబంధం వేసిన లగాన్‌
అమీర్‌ఖాన్‌తో కిరణ్‌కు లగాన్‌ సెట్స్‌పై జరిగిన పరిచయం పెళ్ళి దాకా వెళ్ళింది. 2002లో అమీర్‌ఖాన్‌ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులిచ్చారు. 2005 డిసెంబర్‌లో కిరణ్‌, అమీర్‌ఖాన్‌ల వివాహం జరిగింది.

ఓ తీపి జ్ఞాపకం...
2008 పుట్టిన రోజు కిరణ్‌కు ఓ తీపిజ్ఞాపకాన్ని మిగిల్చింది. తారే జమీన్‌ పర్‌ చిత్రం క్యాంపెయిన్‌ కోసం అమెరికాలో ఉన్న అమీర్‌ఖాన్‌ భార్య పుట్టిన రోజును వేడుకగా జరిపేందుకు షెడ్యూల్‌ కంటే ముందుగానే అక్కడి నుంచి బయలుదేరాడు. బర్త్‌డే పార్టీని ఏ ఫైవ్‌స్టోర్‌హోటల్‌లోనో, ఇంట్లోనో గాకుండా విభిన్నంగా నిర్వహించారు. అప్పట్లో దోభీఘాట్‌ షూటింగ్‌ జరుగుతుండేది. ఆ షూటింగ్‌ సెట్‌లోనే పుట్టినరోజు వేడుక జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులనే ఆ పార్టీకి ఆహ్వానించారు.

అమీర్‌ అభిమానిని...
నేను అమీర్‌ అభిమానిని. ఓ సినిమాను అంతా కొత్తవారితో తీయాలని ఉండేది. అందుకే దోభీఘాట్‌లో అమీర్‌కు స్థానం లేదని కూడా చెప్పాను. కానీ, సరైన నటులు దొరక్క అమీర్‌కు అందులో ఓ పాత్ర ఇవ్వాల్సి వచ్చింది. ఆ అవకాశం ఇవ్వడానికి ముందు ఆ పాత్రకు ఆయన సరిపోతారో లేదో అడిషన్‌ కూడా నిర్వహించాం. మొత్తానికి నా మొదటి చిత్రంలో అమీర్‌కు అవకాశం ఇచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

కెరీర్‌లో మైలురాళ్ళు...

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా...
లగాన్‌ (2001): ఈ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ (2001): అసిస్టెంట్‌ డైరెక్టర్‌
దోభీఘాట్‌ (ముంబై డైరీస్‌) 2011: ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించడంతో పాటుగా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా 2011 జనవరి 21న విడుదలైంది.
స్వదేశ్‌: వి ది పీపుల్‌ (2004): అసిస్టెంట్‌ డైరెక్టర్‌
సాథియా (2002): అసిస్టెంట్‌ డైరెక్టర్

నిర్మాతగా...
దోభీఘాట్‌ (2011)
పీప్లీ లైవ్‌ (2010)
జానే తూ...యా జానే నా (2008)- అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌
తారే జమీన్‌ పర్‌ (2007) అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌

కోల్‌కతాతో అనుబంధం మరువలేనిది...
నేను పుట్టింది కోల్‌కతాలో కాకున్నా ఈ నగరంతో నాకు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. పుట్టిన కొద్ది రోజులకే ఇక్కడకు వచ్చాను. 1973 నుంచి 1992 వరకు ఇక్కడే పెరిగాను. కోల్‌కతాలో గడిపిన జీవితాన్ని మరువలేను. అదో మధుర జ్ఞాపకం.

అణువణువూ ముంబయితో పెనవేసుకుంది...
kiranరెండు దశాబ్దాల పాటు కోల్‌కతాలో పెరిగినా ముంబయితో అణువణువునా బంధం పెనవేసుకుంది. దీన్ని నా సొంత ఇంటిలానే భావిస్తున్నాను. ముంబయి అభిమానిని నేను. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్ళాలని అమ్మానాన్న అనుకున్నప్పుడు నేను మాత్రం ముంబయిలోనో, ఢిల్లీలోనో ఉండాలనుకున్నాను. ముంబయికి వచ్చినప్పుడు ఆ నగరం నన్ను కట్టిపడేసింది. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది.

భర్తనూ దబాయిస్తాను.. డైరెక్టర్‌గా!...
నిర్మాతగా, నటుడిగా, భర్తగా అమీర్‌ పోషించే బహుముఖ పాత్రలతో నేను ఏనాడూ ఇబ్బంది పడలేదు. ఒక్కోపాత్రను అలా విడదీసి ఎన్నడూ చూడలేదు. తెరవెనుక, తెర ముందు కలిసే పని చేసేవాళ్ళం. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకునే వాళ్ళం. దోభీఘాట్‌ సినిమాకు నేను దర్శకత్వం వహించినప్పుడు అమీర్‌ ఖాన్‌తో ఓ డైరెక్టర్‌గానే వ్యవహరించాను. ఆయన నిర్మాత అనో, బాస్‌ అనో, భర్త అనో అనుకోలేదు. నేను డైరెక్టర్‌ను, నేను చెప్పినట్లు చేయాలని దబాయించిన రోజులూ ఉన్నాయి. ఒకరంటే మరొకరికి గౌరవభావం ఉంటుంది. పరస్పరం సహాయం చేసుకుంటాం.

ప్రొఫైల్‌
పేరు : కిరణ్‌ రావు
పుట్టిన తేదీ : నవంబర్‌ 7, 1973
వృత్తి : సినిమా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, స్క్రీన్‌రైటర్‌
భర్త : అమీర్‌ఖాన్‌

- రాజేష్