'స్నేహగీతం'తో దర్శకుడుగా నా ప్రస్థానం ప్రారంభమైంది. ఇదొక చిన్న అడుగు మాత్రమేనని నాకు
తెలుసు. ఐటి రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టే సాహసం చేసిన నన్ను చాలా మంది
అభినందించారు. దర్శకత్వ శాఖలో పూర్వానుభవం ఏమాత్రం లేకపోయినా ఒక దర్శకుడిగా చాలా
నిజాయితీగా నేను చేసిన ప్రయత్నాన్ని పలువురు ప్రశంసించారు. నా మీద చూపించిన ప్రేమ,
కురిపించిన ప్రశంసలకు బదులుగా నేనేం చేయగలనా? అనిపించింది.
ఒక డెబ్యూ డైరెక్టర్‌గా నా అనుభవాలకు అక్షర రూపం ఇస్తే ఏ కొద్దిమందికైనా ఏ కొంత మేరయినా
ఉపయోగపడొచ్చు కదా అనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసం.
నా అనుభవాలను క్లుప్తీకరించేందుకుగాను వాటిని అనుసరణీయములు, నేర్చుకున్న పాఠాలు అనే
రెండు భాగాలుగా విభజించాను. పలు ప్రముఖ ఐటీ కంపెనీలతో ప్రాజెక్ట్ మేనేజర్‌గా నాకున్న అనుబంధం
గురించి మీలో చాలామందికి తెలిసే వుంటుంది. ఐటీ అనుభవం నా మనస్సును, మెదడును ఎప్పుడూ
ప్రభావితం చేస్తూనే వుంటుంది. అందరూ చూసే కోణంలో నుంచి కాకుండా ప్రతి విషయాన్ని సరికొత్త కోణంలో
చూగలిగేందుకు నాకు తోడ్పడుతూ వుంటుంది.
సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను మనం ఎలా పూర్తిచేశాం? దాన్నుంచి
నేర్చుకోవాల్సిందేమిటి? అనే దానిపై మదింపు (ఎనాలసిస్) చేయడం ఐటీ కంపెనీల్లో
జరుగుతుంటుంది. కాబట్టి 'స్నేహగీతం' సినిమా 23కేంద్రాలలో 50రోజులు విజయవంతంగా
ప్రదర్శింపబడ్డాక ఈ ప్రాజెక్ట్‌ను కూడా అలా సెల్ఫ్ ఎనాలసిస్ చేయాలనిపించింది. భవిష్యత్‌లో మూవీమేకర్స్
కావాలనుకుంటున్న ఔత్సాహికులకు ఉపయోగపడే కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
ఉపయోగపడేంత సీన్ వాటికి లేదని మీకనిపిస్తే పక్కన పడేయండి.
మధుర ఎంటర్‌టైన్‌మెంట్ అనే మ్యూజిక్ కంపెనీ, మరియు ఇప్పుడు మీరు చదువుతున్న
'సినీస్టార్' పత్రికల నిర్వాహకునిగా, 2004నుంచి సినిమా పరిశ్రమతో నాకు సంబంధ
బాంధవ్యాలున్నాయి. ఫిలిం ఇండిస్టీలో ఏం జరుగుతుందనేదానిపై ఒక మోస్తరు అవగాహన వుంది.
అందువల్ల నేను దర్శకత్వం వహించే మొదటి సినిమా ఖచ్చితంగా చిన్న సినిమానే అయ్యుండాలని నేను
మానసికంగా ముందే సిద్దపడిపోయాను. ఎందుకంటే... పెద్ద సినిమాలతో పోల్చితే చిన్న సినిమాలకు
ఆర్థికపరమైన రిస్క్ తక్కువ కాబట్టి.
అయితే ఏ తరహా కథతో సినిమా చేయాలి? ఎటువంటి సబ్జెక్ట్ అయితే సేఫ్‌గా వుంటుంది? అనేదానిపై
చిన్న ఊగిసలాట వుండేది. అనుభవజ్ఞులైన దర్శకులు మొదలుకుని కొత్తవారి వరకు రకరకాల కోణాల్లో
యువతరానికి చెందిన కథాంశాలతో సినిమాలు తీసేశారు. ప్రతి పది సినిమాల్లో తొమ్మిది సినిమాల
మూలకథ సుఖాంతమయ్యే ప్రేమే. నేను కూడా కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథనే ఎంచుకున్నాను.
అయితే అందులో సమకాలీన అంశాలను మిళితం చేయాలని నిశ్చయించుకున్నాను.
పరిమితమైన అంచనాలు కలిగిన మధ్య తరగతి స్టూడెంట్స్...
గుండెల్నిండా బోలెడు అంచనాలు పెట్టుకుని, తెలివితేటలు పుష్కలంగా వుండి కూడా
చదువుపై దృష్టిసారించని స్టూడెంట్స్...
సినిమారంగం పట్ల ఎక్కువ మక్కుని పెంచుకుని వుండేవాళ్ళు...
ఏ యూనివర్శిటీలో చూసినా ఈ మూడు తరగతులు, లేదా ఈ విభాగాలకు చెందిన స్టూడెంట్స్
కనిపిస్తారు.
ఈ మూడు కోవలకు చెందిన ముగ్గురు కుర్రాళ్ళు రవి, అర్జున్, కృష్నల చుట్టూ నా కథ తిరిగేలా ప్లాన్
చేసుకున్నాను. ఈ మూడు క్యారెక్టర్లు ఊహాలోకంలో నుంచి కాకుండా వాస్తవానికి చేరువగా వుండేలా డిజైన్
చేసుకున్నాను.
కాలేజీ లేదా యూనివర్శిటీలో ఉన్నత విద్యనభ్యసించే స్టూడెంట్స్ మైండ్స్‌ని సాధారణంగా రెండు
విషయాలు డామినేట్ చేస్తుంటాయి. అవి ప్రేమ, కెరీర్. ఈ రెంటినీ సమన్వయం చేసుకోవడంలో
తడబడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ తడబాట్లు ఘోర తప్పిదాలుగా మిగిలిపోతుంటాయి. వారి
జీవితాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకునేలా చేస్తాయి. నా కథకు ఈ రెండు అంశాలే
ముఖ్యాంశంగా చేసుకోవాలనుకున్నాను. లవ్‌ను, కెరీర్‌ను ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎంత జాగ్రత్తగా,
తెలివిగా, నేర్పుగా ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఆ క్రమంలో వాళ్ళు ఎటువంటి సంఘర్షణలకు
లోనయ్యారన్నదే నా సినిమాకు మూలకథగా మైండ్‌లో ఫిక్సయిపోయాను. ఎటువంటి ఇమేజ్ కానీ,
ఇంప్రెషన్ కానీ లేని కొత్తవాళ్ళతో అయితేనే సినిమా ఫ్రెష్‌గా వుంటుందనే ఉద్దేశంతో స్టార్‌హంట్‌కు శ్రీకారం
చుట్టాను.
పూర్వానుభవం లేకుండా నేను చేయబోతున్న దర్శకత్వం అనే ఓ మహా ప్రయాణం సాఫీగా
సాగిపోవాలంటేనాకు మంచి టీమ్ వుండడం అవసరమని గుర్తించాను. సరైన టీమ్‌ను సెలెక్ట్
చేసుకోవడంలోనే మన సక్సెస్ ఆధారపడివుంటుంది. టీమ్ సెలక్షన్‌లో ఏమాత్రం పొరపాటు చేసినా,
జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.
నా టీమ్ మీద నాకు పూర్తి అదుపు వుండడం అవసరమనే ఉద్దేశంతో నా క్రూ మెంబర్స్‌ని కూడా
అందరూ కొత్తవాళ్ళనే తీసుకున్నాను. చివరికి ఎలాగైతేనే... షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్
వంటి కార్యక్రమాలన్నీ ముగించుకుని సినిమాను విడుదల చేశాం.
సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. కొద్దిపాటి విమర్శలు, అసంఖ్యాక అభినందనలతో పాటు
విమర్శకుల ప్రశంసలు కూడా దండిగా అందుకున్నాను. విమర్శలు, అభినందనలు, ప్రశంసలు...
వాటన్నిట్నీ నేను వినమ్రంగా, ఆనందంగా స్వీకరించాను.
ఇక 'స్నేహగీతం' అనే సినిమా నుంచి నేను నేర్చుకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు
లెసన్స్‌ను చర్చించుకుందాం :
అయితే ఇక్కడ చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే... ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు,
సూత్రాలు దాదాపుగా తక్కువ బడ్జెట్ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయి.
అనుసరణీయాలు :
- షూటింగ్ మొదలు కావడానికి ముందే బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవాలి.
- మధ్యమధ్య తరచుగా చూసే మార్పులు చేర్పులు చాలా డిజాస్టర్స్‌కు దారిస్తాయనే విషయాన్ని దృష్టిలో
వుంచుకోవాలి.
- డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో వున్న ప్రతి ఒక్కరికీ స్క్రిప్ట్ మీద పూర్తి స్పష్టత వుండేలా శ్రద్ధ తీసుకోవాలి.
దీనివల్ల లొకేషన్‌లో మన పని సులభమవుతుంది.
- అయితే కథ, కథనాలు బయట వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా వుండాల్సిన అవసరాన్ని
డైరెక్షనన డిపార్ట్‌మెంట్ సభ్యులంతా గుర్తెరిగేలా చేయాలి.
- మన ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయిన 24క్రాప్ట్స్‌కు చెందిన వారందరూ సినిమా విజయం కోసం
అంకితభావంతో కృషిచేసేలా వాళ్ళను ఇన్‌స్ఫైర్ చేయగలగాలి. వాళ్ళందరితో వీలైనప్పుడల్లా సమావేశం
అవుతూ వుండడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
- సినిమా రూపకల్పన సందర్భంగా జరిగే మంచి, చెడు సంఘటనలు మన మనస్సుపై ప్రభావం
చూపకుండా శ్రద్ధ వహించాలి. ఆ మేరకు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నిర్దేశిత లక్ష్యాన్ని,
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఓర్పుగా, నేర్పుగా అధిగమిస్తుండాలి.
- సినిమా విడుదలకు ముందు తర్వాత మన సినిమాను రకరకాల మాధ్యమాల్లో ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే
వుండాలి.
- టీవి, రేడియో, వెబ్‌సైట్స్, మొబైల్స్, దినపత్రికలు, వారపత్రికలు, షాపింగ్‌మాల్స్,
మల్టీప్లెక్స్‌లు, మ్యూజిక్ స్టోర్స్, సూపర్‌మార్కెట్స్ వంటివి ఇందుకు సమర్థవంతంగా
వినియోగించుకోవాలి.
నేర్పుకున్న పాఠాలు:
- స్క్రిప్ట్ దశలోనే నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెస్ (సృజనాత్మక విభేదాలు) అన్నిట్నీ
పరిష్కరించేసుకోవాలి. స్క్రిప్ట్‌ను బౌండ్ చేయించేనాటికి ఇద్దరి మధ్య సినిమా రూపకల్పనకు సంబంధించి
ఎటువంటి విభేదాలు వుండకూడదు. దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తే విబేదాలు సినిమా బడ్జెట్‌పై
గణనీయంగా ప్రభావం చూపుతాయి.
- ఛాయాగ్రహకుడితో కథ, కథనాలను క్షుణ్ణంగా చర్చించండి. షఉటింగ్ ప్రారంభానికి ముందే స్టోరీ
బోర్డ్‌ను సిద్ధం చేసుకోవడంతోపాటు షాట్ డివిజన్‌ను ప్రిపేర్ చేసుకోవడం పూర్తి చేసుకోవాలి. అవసరమైన
సందర్భాల్లో షాట్ డివిజన్‌ను లొకేషన్స్‌లో మార్చుకోవచ్చు. అయితే ఈ విషయమై ముందుగా హౌంవర్క్
చేయడం వలన దాదాపు 30శాతం శ్రమ, సమయం మనకు ఆదా అవుతాయి.
- మొదలైన దగ్గర్నుంచి ఆరు నెలల్లో సినిమా విడుదలై తీరేలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అందుకు
అవసరమైన ఆర్థిక వనరులన్నీ పూర్తిగా అమరాక మాత్రమే షఉటింగ్ మొదలుపెట్టాలి.
- సినిమా అనే దోశను వేడివేడిగా సర్వ్ చేసినపుడు మాత్రమే రుచికరంగా వుంటుంది.
- ప్రీప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అనే నాలుగు దశలూ సినిమా రూపకల్పనకు
చాలా కీలకమైనవే. ప్రమోషన్ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్‌లో ఇన్‌క్లూడ్ చేయాలి.
నేను అబ్జర్వ్ చేసినదాని ప్రకారం చాలామంది ప్రొడక్షన్ వరకే బడ్జెట్ వేసుకుంటుంటారు. షూటింగ్
పూర్తయ్యేసరికి ఏదో ఒక రూపంలో (ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ రైట్స్) డబ్బులు వస్తాయని, అవి ఖర్చు
పెట్టవచ్చని అంచనా వేస్తుంటారు. ఇది చాలా తప్పు. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి
చేయడంలో జరిగే ఆలస్యం ఇటువంటి తప్పుడు అంచనాలవల్లే జరుగుతుంది.
- ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తవాళ్ళు రూపొందించే సినిమాలు కొనుగోలు చేసేందుకు
ఎవరూ ముందుకురారు. స్వంతంగా విడుదల చేసుకోవడానికి కూడా సిద్ధపడి మాత్రమే రంగంలోకి
దిగాలి.
- ఇకపోతే విడుదలకు ముందు మీ టీమ్ మెంబర్స్‌కు తప్ప ఇతరులెవ్వరికీ పొరపాటున కూడా మీ
సినిమాను కానీ, అవుట్‌పుట్‌ను కానీ చూపించకండి.
- థియేటర్లలో సామూహికంగా సినిమా చూసే ప్రేక్షకుల స్పందనకు ప్రివ్యూ థియేటర్‌లో ఒంటరిగా కూర్చుని
సినిమాను డిసైడ్ చేసే పెద్ద మనుషుల లేదా మేథావుల స్పందనకు చాలా వ్యత్యాసం వుంటుంది.
- 'శివ', 'గీతాంజలి', 'మనీ' 'ఆనంద్' వంటి చిత్రాలు ఘన విజయాలు సాధిస్తాయని
ప్రివ్యూ థియేటర్లలో ఆ సినిమాను చూసిన మేథావులెవరూ అంచనా వేయలేకపోయారనే విషయం ఇక్కడ
గమనార్హం.
గమనిక :
ఇతరులిచ్చే ఐడియాలు, సజెషన్స్‌ను పాటించడంకంటే మీ మనసు చెప్పినట్లుగా నడుచుకోవడం,
అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. మీరు నమ్మిన పనిని, ప్రేమించిన
దానిని త్రికరణశుద్ధిగా పాటించండి. విజయం తనంతట తనే మీ చెంతకు చేరుతుంది. ఇదంతా పెద్ద
సుత్తిలా అనిపిస్తే ఈ వ్యాసాన్ని చదివిన విషయాన్ని కూడా మరచిపోండి. కానీ మీ టైమ్ పర్మిట్ చేస్తే ఈ
ఆర్టికల్ మీకు నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో sridhar.madhura@gmail.comకు మెయిల్
చేయండి.
ఔత్సాహికులకు ప్రత్యేక గమనిక :
సినిమా రూపకల్పనకు సంబంధించి మీకు పూర్తిస్థాయి అవగాహన, సరైన కార్యాచరణ లేకుండానే ఆవేశంతో
రంగంలోకి దిగితే నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారు. దర్శకులు తమ భవిష్యత్ (దర్శకులుగా)
కోల్పోతారు. కళామతల్లి చాలా అరుదుగా మాత్రమే రెండో అవకాశాన్నిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!!