సుమారు 28 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఆకాశవాణి, దూరదర్శన్ లకు సేవలందించి ప్రతిభ ఆధారంగా డైరెక్టర్ స్థాయికి ఎదిగినట్లు
గర్వంగా చెబుతున్న శైలజ మహిళలు స్వశక్తితో ముందుకు సాగేందుకు ప్రభుత్వ తోడ్పాటు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ముఖ్యంగా పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండే మార్కెటింగ్ రంగంలో సైతం ఎనిమిదేళ్లు పనిచేసి సంస్థకు లాభాల నార్జించి పెట్టడమే
కాకుండా నాలుగు సార్లు మార్కెటింగ్ లో జాతీయస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నట్లు ఆమె చెప్పారు. బందరులో ఓ విద్యావంతుల
కుటుంబంలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంటూ, మహిళల్లో విద్యావ్యాప్తి ద్వారానే చైతన్యం తీసుకురావాల్సిన
అవసరముందన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో విద్య, ఆరోగ్యంతోపాటు ప్రభుత్వ చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సి వుందని
ఆమె పేర్కొన్నారు. తమవంతుగా దూరదర్శన్ లో మొదటి నుంచీ వ్యవసాయం, కళలతోపాటు మహిళలు, పిల్లలకు సంబంధించిన అంశాలకే
ప్రాధాన్యాతనిస్తున్నామన్నారు. వారిని మరింత చైతన్యవంతులను చేసే కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలు,
పిల్లలకు సంబంధించి తాము తరచూ డాక్యుమెంటరీలు రూపొందించి ప్రసారం చేస్తున్నట్లు, వీటివల్ల ఎంతో మందికి మేలు చేకూరుతున్నట్లు
ఆమె తెలిపారు.
సంకుచిత ధోరణి వీడితేనే విజయం
తానెప్పుడూ తానొక మహిళ అనే ఉద్దేశంతో సంకుచితంగా ఆలోచన చేయలేదని, పరిస్థితులకు అనుగుణంగా ఆత్మవిశ్వాసం. సానుకూల
దృక్పధాలతో ముందుకు సాగినట్లు ఆమె చెప్పారు. తాను ఇప్పటివరకూ లింగవివక్షకు గురికాలేదని, తన ఎదుగుదల వెనుక పురుషుల
సహకారం కూడా ఎంతో ఉందన్నారు. అయితే ఇంకా చాలా చోట్ల మహిళా ఉద్యోగులు లింగ వివక్ష ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలు
తననెంతో బాధిస్తున్నాయని తెలిపారు. పురుషులతో సమానంగా పనిచేస్తూ, సమాన వేతనాలు పొందుతున్న మహిళ పురుషునితో ఏ
విధంగానూ తక్కువకాదని శైలజ అభిప్రాయపడ్డారు. మహిళను తక్కువచేసి చూసే ధోరణి సమూలంగా మార్చాల్సిన అవసరముందన్నారు.
ప్రభుత్వపరంగా మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం కొంతవరకు సమంజసమైనా మహిళలు వాటినే ఊతకర్రలుగా మలుచుకోవడం
సరికాదన్నారు. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న చట్టాలు తాము చేస్తున్న కృషికి అండగా మాత్రమే ఉండాలి తప్ప లక్ష్యాలను
చేరుకునేందుకు అవే రహదారులుగా మారకూడదన్నారు. పూర్తిగా ప్రభుత్వ సహకారంపైనే ఆధారపడితే అది లభించనినాడు వికలాంగుడి
మాదిరి పరిస్థితి ఉత్పన్నమౌతుందన్నారు. ప్రతి మనిషీ తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్థారించుకొని దాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి
చేస్తే విజయం తనంతటదే సాకారమౌతుందనే వాస్తవాన్ని అనుభవసపూర్వకంగా గ్రహించినట్లు ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా ప్రముఖులంతా సమష్టిగా ముందుకు సాగాలి
ఒక మహిళగా తాను తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలందిస్తున్నట్లు, ఇంతర సంస్థల్లో
సైతం ప్రముఖ స్థానాల్లో వున్న మహిళలు వారి - వారి సంస్థల్లో మహిళలకు అందడా నిలిస్తే చాలా వరకు ఇబ్బందులు దూరమౌతాయన్నారు.
అంతే కాకుండా సమాజంలో ప్రముఖ స్థానాలను అలంకరించిన మహిళలంతా ఓ వేదికపైకొచ్చి మహిళల సంక్షేమానికి కృషి చేయాల్సిన
అవసరముందన్నారు. అదే సమయంలో బాధిత మహిళలు సైతం తమకు జరుగుతున్న అన్యాయాన్ని దాచుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి
ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. మహిళల పట్ల వివక్ష ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేదని, గతంలో అమెరికా సహా పలు
అనేక దేశాల్లో మహిళలకు కనీసం ఓటుహక్కు కూడా ఉండేది కాదని ఆమె గుర్తుచేశారు. మహిళా చైతన్యం ద్వారా ప్రస్తుతం అటువంటి
పరిస్థితులు చాలా వరకు తొలగిపోయాయని శైలజ పేర్కొన్నారు. మన దేశంలో కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు మార్పు వచ్చినా
ఇంకా చాలా చోట్ల మారుమూల ప్రాంతాల్లోని మహిళలే కాకుండా చదువుకున్నవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారని శైలజ
ఆవేదన వ్యక్తం చేశారు.
దూరదర్శన్ ను యువతకు చేరువచేయడమే లక్ష్యం
ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరి వివిధ విభాగాల్లో పనిచేయడం ద్వారా అపార అనుభవాన్ని గడించినట్లు శైలజ చెప్పారు. ఎఫ్.ఎం
రేడియోను ప్రారంభించి అనతికాలంలోనే దాన్ని విజయవంతంగా అన్ని వర్గాలకూ చేరువచేసినట్లు, అదే బాటలో ఇప్పుడు దూరదర్శన్ ను
కూడా తీర్చిదిద్దనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా యువతను ఆకర్షించే కార్యక్రమాలకు దూరదర్శన్ లో ప్రాధాన్యత
కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పౌరాణిక సినిమాలు, పాత పాటలు, సంగీతం, నాట్యం తదితరవాటికి సంబంధించిన
రికార్డులను భద్రపర్చడమే కాకుండా వాటిని సీడీలుగా రూపొందించి ప్రస్తుత తరాలనికి అందించినట్లు ఆమె తెలిపారు. తమకు ఎవరితో(ఏ
ఛానల్ తోనూ)నూ పోటీలేదని, వార్తావిశేషాలపై సైతం సంచలనాలకు తావివ్వకుండా, తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నది ఉన్నట్లుగా
చూపడమే తమ విధానమన్నారు. అందుకే నేటికీ దూరదర్శన్ ప్రేక్షకాదరణ చూరగొంటోందని శైలజ వ్యాఖ్యానించారు.
మహిళను దోషిగా చూపడం తగదు
పలు టీవీ ఛానళ్లు మహిళనే ప్రధాన కేంద్రంగా సీరియళ్లు రూపొందించడం, అందులోనూ మహిళలను కించపర్చే విధంగా అసభ్యంగా
ప్రదర్శించడం సరికాదని శైలజ అభిప్రాయపడ్డారు. మరీ కొన్ని ఛానళ్లైతే మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన వార్తాంశాలకు
అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాటిని వాస్తవ రూపంలో అభినయించి చూపుతున్నాయని, ఇది అత్యంత బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
ఇతర ఛానళ్లపై విమర్శ చేయడం తన ఉద్దేశం కాకున్నా కనీసం నేరం రుజువయ్యేవరకన్నా వారిని దోషులుగా చూపకుండా సంయమనం
పాటిస్తే బావుంటుందన్నారు. దూరదర్శన్ ఏర్పడి అర్థశతాబ్దం దాటినా తాము ఇప్పటికీ ఎక్కడా సంచనాలకు తావివ్వకుండా, ఎవరి హక్కులకూ
భంగం వాటిల్లకుండా వార్తాంశాలను ప్రసారం చేస్తున్నాట్లు శైలజా సుమన్ వివరించారు.