సమాజ హితానికి నాటికలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రి డొక్కా వూణిక్య వరప్రసాద్ అన్నారు. డాక్టర్
అక్కినేని నాగేశ్వరరావు నాటిక కళాపరిషత్ 17వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా
ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రి మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ పలు సంఘటనల సమాహారంతో
ఉత్సుకతను రేకిస్తూ, సమాజానికి నీతిని బోదిస్తూ, ప్రజలను ఆలోచింపచేస్తూ వడివడిగా సాగిపోతుంటాయన్నారు. వీటి
విశిష్టత గురించి ఇప్పటి పిల్లలకు తెలియజేసే విధంగా ప్రతి పాఠశాలలో నాటక, సంగీత ఉపాధ్యాయులను
నియమించాలన్నారు. 17 ఏళ్లుగా యువకళావాహిని చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
అనంతరం అక్కినేని మాట్లాడుతూ నాటికలు కన్నతల్లి ఒడి లాంటివన్నారు. ఒక నటుడిలోని అన్ని కోణాలు
నాటికల్లోనే ఆవిష్కృతమవుతాయన్నారు. కళలను ప్రోత్సహించేవాళ్లు ఉన్నారు కాబట్టే నాటక రంగం ఈ స్థాయిలో ఉందని
దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు, గూడూరు సావిత్రి, డి.ఎస్.దీక్షిత్,
ఎన్.దుర్గాప్రసాద్‌లకు కళాసమితి తరఫున పురస్కారాలు ప్రదానం చేశారు. ఆది వారం వరకు జరిగే ఈ పోటీల్లో 12
నాటికలను ప్రదర్శించనున్నారు. నటుడు కైకాల సత్యనారాయణ, కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, ప్రఖ్యాత
రంగస్థల ప్రయోక్త చాట్ల శ్రీరాములు, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్, వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత
వాసుదేవరావు హాజరయ్యారు. అంతకు ముందునిర్వహించిన అక్కినేని సినీగీతాల విభావరి ఆకట్టుకుంది.
అలరించిన ‘బావిలో కప్ప’
నాటిక పోటీల్లో భాగంగా తొలిరోజు మల్లాది క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన బావిలో కప్ప నాటిక ప్రేక్షకులకు నవ్వులతో
పాటు సందేశాన్ని పంచింది. తన చుట్టూ ఉన్నదే లోకమని భావించి, ప్రపంచాన్ని విస్మరించే వారు ఏం నష్టపోతారో కళ్లకు
కట్టింది.