సినీన్యూస్
 
 
 
 
 
బాలచందర్‌కు దాదా సాహెబ్ ఫాల్కే
భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవమిది! ప్రముఖులతో కూడిన కమిటీ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు బాలచందర్ పేరును సిఫారసు చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. వెండితెరకు కొత్త వెలుగులను ఇచ్చి, సినీ చరిత్రలో 'మరో చరిత్ర'ను సృష్టించిన మహా దర్శక 'చంద్రుడి'కి ఓ నూలు పోగును సమర్పించింది.

ఎన్నో మలుపులు...
కైలాసం బాలచందర్ (81) సినిమాల్లోని ప్రతి ఫ్రేములో ఒక 'ఫీల్' ఉంటుంది. సినిమా ముగిశాక... ఉద్వేగంతోనో, బాధతోనో, ఏదో తెలియని అనుభూతితోనో గుండె బరువెక్కుతుంది. మధ్య భావోద్వేగంతో మనసు మెలి తిరుగుతుంది. కన్ను చెమరుస్తుంది. సరళంగా, సూటిగా, స్పష్టంగా వెలువడే డైలాగ్ 'ఫటాఫట్' అంటూ నేరుగా హృదయాన్ని తాకుతుంది. ఎన్నో రకాల మనసులు, ఎన్నెన్నో రకాల మనుషులను పాత్రలుగా చేసి వాటి చేత జీవిత కథను నడిపించడం బాలచందర్‌కే చెల్లు! మూసకు చెల్లుచీటీ ఇచ్చి, అప్పటిదాకా ఉన్న సంప్రదాయాలకు ఎదురీదుతూ సినిమాలు తీయడం బాల చందర్‌కే సాధ్యమైంది.

అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం చేసుకునే బాలచందర్ సినిమాల్లోకి రావడమే ఒక అద్భుతం. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జన్మించిన ఆయన కథలు, నాటకాలు రాసేవారు. తర్వాత... తమిళ సినిమాల్లోకి స్క్రిప్టు రచయితగా అడుగుపెట్టారు. అదరగొట్టే డైలాగులు, ఘాటైన మెలో డ్రామాతో నిండిన తమిళ సినిమాకు బాలచందర్ సున్నితత్వాన్ని పరిచయం చేశారు. ఎంజీఆర్ నటించిన 'ధీవ థాయ్' చిత్రంతో బాలచందర్ డైలాగ్ రైటర్‌గా పరిచయమయ్యారు.

ఆ తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి పెద్ద నటులతో ఎప్పుడూ పని చేయలేదు. 1975లో కొత్త, చిన్న నటులతో 'అపూర్వ రాగంగల్' (అంతులేని కథ) సినిమా నిర్మించి 'చరిత్ర' సృష్టించారు. ఈ సినిమాతో రజనీకాంత్, కమల్‌హాసన్, జయప్రదలను ఆయన వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్, సరితలతో 'మరో చరిత్ర' సృష్టించారు. ఇదే సినిమా కమల్, రతీ అగ్నిహోత్రిలతో 'ఏక్ దూజేకే లియే' పేరిట నిర్మించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాలచందర్ తెరకెక్కించిన ఇరు కొండుగల్, అపూర్వ రాగంగల్ (అంతులేని కథ), తన్నీర్ తన్నీర్ (దాహం దాహం), అచమిల్లై అచమిల్లై చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి.

చిరంజీవితో తెలుగులో తీసిన 'రుద్రవీణ' 1988లో జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైంది. 1987లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదు అందించింది. తమిళనాడు ప్రభుత్వం 1973లోనే బాలచందర్‌కు 'కలైమామణి' పురస్కారంతో సత్కరించింది. బాలచందర్ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాలకు పని చేశారు. టీవీ సీరియళ్ల రూపంలో బాలచందర్ ఇప్పుడు ఇంటింటికీ చేరుతున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకింద స్వర్ణ కమలతోపాటు పది లక్షల రూపాయల నగదును అందిస్తారు.