సినీన్యూస్
 
 
 
 
 
ఎవర్‌గ్రీన్ హీరో మరి లేరు
అసలు సిసలు ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ స్టార్‌గా అశేష ప్రజానీకం నీరాజనాలు అందుకున్న దేవానంద్ (88) మరణం ఆయన సహ నటుల నుంచి అభిమానుల దాకా అందరి హృదయాల్నీ విషాదంలో ముంచెత్తింది. 65 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంలో దేవానంద్ 'కాలా పానీ', 'గైడ్', 'హమ్ దోనో', 'తేరే ఘర్ కే సామ్నే', 'పేయింగ్ గెస్ట్', 'జ్యూయెల్ థీఫ్', 'హరే రామ హరే కృష్ణ' వంటి గొప్ప చిత్రాల్లో నటించారు. ఎత్తుపల్లాలను ఎన్నింటినో చవిచూసిన ఆయన ఎన్నడూ తలదించుకున్నది లేదు. పడిన ప్రతిసారీ కెరటంలా లేచిన ధీరుడు దేవానంద్. ఆదివారం లండన్‌లో గుండెపోటుతో దేవానంద్ మృతి చెందారన్న వార్త వినగానే శోకతప్తం కాని సినీ ప్రేమికుడు లేడు. 1923 సెప్టెంబర్ 26న ఓ పంజాబీ న్యాయవాదికి జన్మించిన దేవ్ సాబ్ ఇంగ్లీష్ సాహిత్యం, న్యాయశాస్త్రం అభ్యసించారు.

నటన మీద ఆసక్తితో ముంబైకి వెళ్లి 1946లో 'హమ్ ఏక్ హై' చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు దేవానంద్. అందులో ఆయన సరసన నాయికగా నటించిన కమలా కోట్నిస్ పేరుకి మరాఠీ రంగస్థల నటి అయినా ఆమె కర్నూలుకు చెందిన తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. కమల తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించారు. 1947లో వచ్చిన 'జిద్ది' చిత్ర హిట్టవడంతో దేవానంద్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. అందమైన రూపం, మృదువైన స్వరం, రొమాంటిక్ పాత్రలతో అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించారు. 1949లో సొంత నిర్మాణ సంస్థ నవకేతన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్‌ను స్థాపించిన ఆయన ఆ బేనర్‌పై 35 పైగా చిత్రాలు నిర్మించారు.

1971లో వచ్చి ఘన విజయం సాధించిన 'హరే రామ హరే కృష్ణ' దర్శకుడిగా ఆయన తొలి చిత్రం. 'తేరే ఘర్ కే సామ్నే', 'జ్యూయెల్ థీఫ్', 'గైడ్' సినిమాలు విలక్షణ నటునిగా ఆయన సామర్థ్యానికి మెచ్చు తునకలు. దర్శకుడిగా 'హరే రామ హరే కృష్ణ'తో దేశాన్ని ఊపేసిన దేవానంద్ ఆ సినిమా ద్వారా జీనత్ అమన్‌ను గ్లామర్ ఐకాన్‌గా మార్చేశారు. అలాగే 1971లో వచ్చిన హిట్ ఫిల్మ్ 'దేశ్ పర్‌దేశ్'తో టీనా మునిమ్‌ను పరిచయం చేశారు. ఆయన సినిమాల్లో అనేకం మ్యూజికల్ హిట్స్ కావడం గమనించదగ్గ అంశం.

అందమైన రూపంతో అనేకమంది అమ్మాయిల కలల రాకుమారునిగా మారిన ఆయన తన తోటి నటి సురయ్యా ప్రేమలో పడ్డారు. వారి ప్రణయం వికసించాక సురయ్యా నాయనమ్మ వ్యతిరేకించడంతో బలవంతంగా విడిపోక తప్పలేదు. ఆ తర్వాత మరో నటి కల్పనా కార్తీక్‌ని ఆయన వివాహమాడారు.

2001లో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునీ, 2006లో అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డునీ అందుకున్న ఆయన నటించిన చివరి చిత్రం 'చార్జ్‌షీట్' ఈ ఏడాదే విడుదలైంది. ఈ చిత్రానికి ఆయనే రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయం చెంది ఉండవచ్చు గాక, కానీ అది సినిమా పట్ల ఆయనకున్న తపన ఎలాంటిదనే దానికి అది ఓ నిదర్శనం. సెప్టెంబర్‌లో తన జన్మదినం సందర్భంగా మరిన్ని సినిమాలు చేసే సామర్థ్యం తనలో ఉన్నదని తెలిపారు. "ఇరవై ఏళ్ల వయసులో ఎంత ఉత్సుకత ఉందో అంత ఉత్సుకతా ఈ రోజూ ఉంది. నేను చేయడానికి ఇంకా చాలా విషయాలున్నాయి. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రాన్ని 'హరే రామ హరే కృష్ణ ఆజ్' పేరుతో రీమేక్ చేయాలన్న కోరిక ఉంది'' అని ఆయన చెప్పారు.

110 చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన 2007 సెప్టెంబర్‌లో 'రొమాన్సింగ్ విత్ లైఫ్' పేరుతో ఆత్మకథను వెలువరించారు. ట్విట్టర్ ద్వారా అమితాబ్ బచ్చన్ ఇచ్చిన సంతాప సందేశం "ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది'' అన్నది ముమ్మాటికీ సత్యం.