అందచందాలతో, నటనా వైదుష్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ కలలరాణి ఎలిజబెత్ టేలర్ (79) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండెకు సంబంధించిన
అస్వస్థతతో బాధపడుతూ, రెండు నెలల కిందట లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినాయ్ ఆస్పత్రిలో చేరిన ఆమె, ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు గల
ఎలిజబెత్ టేలర్ బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం నటనా రంగంలో కొనసాగిన ఆమెకు మూడుసార్లు ఆస్కార్ అవార్డు లభించింది. ‘బటర్‌ఫీల్డ్ 8’
(1960), ‘హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్’ (1966) చిత్రాలు ఆమెకు ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 1993లో
మరోసారి అవార్డు లభించింది. ‘క్లియోపాత్రా’లోని నటన ఆమెకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఎనిమిదిసార్లు చేసుకున్న పెళ్లిళ్లు, దివంగత పాప్ రారాజు మైకేల్ జాక్సన్‌తో అనుబంధం, ఆమె
చుట్టూ వ్యాపించిన వదంతులు, వివాదాలు ఆమెను నిరంతరం వార్తల్లో నిలిపాయి. ఎలిజబెత్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పదిమంది మనవలు, నలుగురు ముని మనవలు
ఉన్నారు.
ఎలిజబెత్ టేలర్ ప్రస్థానం
నార్త్ లండన్‌లో 1932 ఫిబ్రవరి 27న జన్మించిన ఎలిజబెత్ టేలర్, పదేళ్ల వయసులోనే 1942లో ‘దేర్స్ వన్ బోర్న్ ఎవిరి మినిట్’ చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు.
పద్దెనిమిదేళ్ల వయసులో 1950లో ప్లేబాయ్ హోటల్ చైన్ వారసుడు నికీ హిల్టన్‌ను పెళ్లాడారు. చివరిసారిగా 1991లో లారీ ఫోర్టన్‌స్కీని పెళ్లాడారు. మొత్తం ఎనిమిదిసార్లు పెళ్లిళ్లు
చేసుకున్న ఎలిజబెత్ టేలర్‌కు ఏడుగురు భర్తలు. బ్రిటిష్ నటుడు రిచర్డ్ బర్టన్‌ను ఒకసారి పెళ్లాడి విడాకులిచ్చేశాక మరోసారి ఆయననే పెళ్లాడటం విశేషం. హిల్టన్‌తో కాపురం రెండేళ్లకే
పెటాకులవడంతో, తనకంటే ఇరవయ్యేళ్లు పెద్దవాడైన నటుడు మైకేల్ వైల్డింగ్‌ను 1952లో పెళ్లాడారు. ఐదేళ్లు వైల్డింగ్‌తో సాగించిన కాపురంలో ఇద్దరు పిల్లలను కన్నారు. వైల్డింగ్‌కు
విడాకులిచ్చిన వారం రోజులకే హాలీవుడ్ నిర్మాత మైక్ టాడ్‌తో ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. టాడ్ 1958లో విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సమయంలో
ఎలిజబెత్‌కు టాడ్ మిత్రుడైన నట గాయకుడు ఎడ్డీ ఫిషర్ బాసటగా నిలిచారు.
ఫిషర్‌ను 1959లో పెళ్లాడారు. ఫిషర్‌తో కలసి నటించిన ‘బటర్‌ఫీల్డ్ 8’ ఎలిజబెత్‌కు తొలి ఆస్కార్ అవార్డు సాధించి పెట్టింది. ఫిషర్‌తో కాపురం సాగిస్తూనే, ‘క్లియోపాత్రా’లోని
సహనటుడు రిచర్డ్ బర్టన్‌తో ప్రేమాయణం సాగించడంతో మరోసారి విడాకులు తప్పలేదు. బర్టన్‌తో 1964 నుంచి 74 వరకు కాపురం సాగించాక విడాకులు తీసుకున్నారు. తిరిగి ఆయననే
1975లో పెళ్లాడినా, తొమ్మిది నెలల్లోనే మళ్లీ విడాకులు తీసుకున్నారు. తర్వాత అమెరికన్ సెనేటర్ జాన్ వార్నర్‌ను 1976లో పెళ్లాడగా, ఆరేళ్లు ఆయనతో కాపురం కొనసాగింది.
వార్నర్‌తో విడాకులు పొందిన తొమ్మిదేళ్లకు 1991లో భవన నిర్మాణ రంగానికి చెందిన లారీ ఫోర్టెన్‌స్కీని పెళ్లాడారు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఎలిజబెత్ టేలర్,
చివరిసారిగా 2006లో సీఎన్‌ఎన్ చానల్ నిర్వహించిన ‘లారీ కింగ్ లైవ్’ టాక్ షోలో కనిపించారు.